మేడ్చల్, మే16(నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధితో రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ర్టానికి చేసిన అభివృద్ధిని చూసి దేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దేశమంతటా గెలిపించాలని చూస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని, ఒకపక్క సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మంత్రి కేసీఆర్ ఐటీ రంగాన్ని విస్తరింపజేసి లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీగా మారి పెద్ద బలగం తయారైందన్నారు. బీఆర్ఎస్ని ఢీ కొట్టేసత్తా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేదన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలకు ముఖం చూయించలేని ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్టానికి ఏం చేస్తాడని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి ప్రజలకు మాయమాటలు చెప్పి ఎంపీగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏదో రాష్ర్టాన్ని ఉద్దరించే మాటాలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటాలు నమ్మకండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
అబద్ధాలు చేప్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దని రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. 2014 ముందు ప్రసుత్తం ఉన్న తీరును తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని ఆశ్వీరదించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, సెక్టార్లలో లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి కేసీఆర్‌ను తిరిగి మరోమారు గెలిపించాలని పల్లా విజ్ఞాప్తి చేశారు.
బీజేపీ చేసిందేమీలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చకచకా పూర్తవుతుంటే కేంద్రం మంజూరు చేసిన అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని పక్క రాష్ర్టాల ప్రజాప్రతినిధులు మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన ఎంపీ రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్, దర్గా దయాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.