మేడ్చల్, ఫిబ్రవరి 16: మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం జరిగింది. సొంత అన్నను తమ్ముడు, తన చిన్నాన్న కొడుకుతో కలిసి వెంటాడి వేటాడి బసిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో దాడి చేసి చంపారు. ప్రాణం పోయే వరకు కసి తీరా చంపారు. అందరూ స్తుండగానే ఈ దారుణ ఘటన జరగడంతో మేడ్చల్ ఒక్కసారి ఉలిక్కి పడింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం…. కామారెడ్డి జిల్లా శ్రీ మాచారెడ్డికి చెందిన గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గన్యా దంపతులకు ఉమేశ్ (24), రాకేశ్(22), హరిణి ముగ్గురు సంతానం ఉన్నారు. ఉద్యోగ బాటలో కుటుంబంతో సహా మేడ్చల్ కు వచ్చి, ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. పెద్ద కొడుకు ఉమేశ్ పెళ్లి అయి భార్య ప్రియాంక ఇద్దరు సంతానం ఉన్నారు.
రాకేశ్, హరిణి చదువకుంటుండగా ఉమేశ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. భౌతికంగా దాడులకు దిగుతున్నాడు. ఎన్నో ఏండ్లుగా కుటుంబ సభ్యులతో ఉమేశు గొడవలు లెత్తుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, భార్యపై కూడా దాడికి దిగుతున్నాడు. ఇదే బాటలో ఆదివారం కూడా ఉమేశ్ మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. విషయాన్ని తెలుసుకున్న రాకేశ్, తన చిన్నాన్న కొడుకు అయిన లక్ష్మణ్, బంధువులు నవీన్, నరేశ్, సురేశ్ తో కలిసి అన్న అద్దెకు ఉన్న ఇంట్లో ఉమేశ్ తో గొడవకు దిగారు.
వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఎదురు తిరిగారు. ఇంట్లో ఉన్న బీరు సీసా, కత్తులతో ఉమేశీపై దాడికి పాల్పడ్డారు. అక్కడే అతడికి రక్త గాయాలు అయ్యాయి. దీంతో భయకంపితుడైన ఉమేశ్ ఆర్టీసీ కాలనీ నుంచి జాతీయ రహదారిపై పరుగులు పెట్టాడు. అతడిని రాజేశ్, లక్ష్మణ్ తరుముకుంటూ వచ్చారు. బస్ డిపో ఎదుట పట్టుకున్న వారు ఉమేశ్‌పై కత్తులతో దాడి చేసి, హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఉమేశ్ తల్లి, భార్య తన పిల్లలతో సహ ఘటనా స్థలానికి వచ్చి, రోదించారు.
కాగా విధి నిర్వహణలో భాగంగా తూప్రాన్ వైపు వెళ్తున్న గన్యాను తిరిగి డిపోకు రప్పించారు. అతడు మీడియాతో మాట్లాడుతూ పెద్ద కొడుకు ఉమేశ్‌తో చాలా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఏ పని చేయకుండా కుటుంబ సభ్యులందరిని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. దుబాయికి పంపాలని ప్రయత్నం చేసినా ఏజెంట్‌తో గొడవ పెట్టుకొని, తిరిగి మేడ్చలకు వచ్చాడని తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉమేశ్ వేధింపులను భరించలేని సోదరుడు ఉమేశ్‌పై రాకేశ్, లక్ష్మణ్ పాటు మరో ముగ్గురు పథకం ప్రకారం దాడి చేసి, హతమార్చినట్టు తెలుస్తోంది.
కాగా ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కత్తితో దాడి విషయం తెలియగానే తాము ఘటనా స్థలానికి వెళ్లి, గాయపడిన ఉమేశ్ ను మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. అతడి ఒంటిపై 12 కత్తిపాట్లు ఉన్నాయని తెలిపారు. వైద్యులు పరీక్షించి, చనిపోయినట్టు నిర్ధారించారని తెలిపారు. మృతుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బంది పెడుతుండటంతో అతడితమ్ముడు రాకేశ్, వరుసకు సోదరుడైన లక్ష్మణ్ తో కలిసి హత్య చేసినట్టు ప్రాథమిక విచారణ తెల్సిందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించామని ఆయన చెప్పారు. గతంలో మృతుడిపై పలు పోలీస్ స్టేషన్లలో ఒక హత్య కేసుతో పాటు దాడి, దొంగతనం తదితర కేసులు నమోదైనట్టు తెలిపారు. కాగా పోలీసులు రాకేశ్, లక్ష్మణ్ తో పాటు నరేశ్, సురేశ్, సురేశ్ ను అదుపులోకి తీసుకున్నట్టు విచారిస్తున్నట్టు సమాచారం.