బంజారాహిల్స్,జూన్ 19 : స్నేహితుడిలా మెలిగిన సోదరుడు అనారోగ్యంతో మృతిచెందగా తట్టుకోలేక అన్న గుండెపోటుతో ప్రాణాలు వదిలిన ఘటన ఫిలింనగర్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్‌లో నివాసం ఉంటు న్న మార్ల యాదగిరి అలియాస్ యాదయ్య(30), అదే బస్తీలో నివాసం ఉంటున్న పెదనాన్న కొడుకు మార్ల వెంకటేశ్(45) రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వారిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతుండేవారు. కాగా యాదయ్య కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మార్ల వెంకటేశ్ తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు.
తనకన్నా చిన్నవాడైన యాదయ్యను తలచుకుంటున్న క్రమంలో మార్ల వెంకటేశ్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. వీరిద్దరి మృతితో ఫిలింనగర్లో విషాదం నెలకొంది. వారు అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా కనిపించేవారని, మరణంలోనూ కలిసే వెళ్లారంటూ స్థానికులు, బంధుమిత్రులు కన్నీటిపర్యంతమయ్యారు. యాదయ్య, వెంకటేశ్ అంత్యక్రియలు శుక్రవారం ఒకే సమయంలో పూర్తి చేశారు. కాగా వీరిద్దరి మృతి విషయాన్ని తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ వారి అంత్యక్రియల కోసం రూ. 20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని పంపించారు.