దుండిగల్, నవంబర్13: భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెళ్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వీణ, నవీన్ దంపతుల గత కొన్నెండ్లుగా దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ ప్రాంతంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కొడుకు ఆకాశ్(7) ఉన్నాడు.
వీణ తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో ఉంటూ ఓ బహుళ అంతస్తుల నిర్మాణంలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఆకాశ్ తన అమ్మమ్మ ఉంటున్న భవనం వద్దకు వెళ్లి నిర్మాణ దశలో ఉన్న గేటు వద్ద ఆడుకుంటండగా ప్రమాదవశత్తు గేటు ఊడి మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భవన యజమాని నిర్మాణంలో ఉన్న గేటుకు ఎలాంటి రక్షణ లేకుండా ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు.. దుండిగల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.