Kabaddi | బొల్లారం, ఫిబ్రవరి 20 : హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు అండర్ 14 విభాగంలో బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇందులో సబ్ జూనియర్ కేటగిరీలో ఒకే పాఠశాల నుండి తులసి, మంగాయమ్మ, విజయ లక్ష్మి, లోహిత, వాసిని, దివ్య ఎంపిక కావడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా కిట్లను అందజేశారు. వికారాబాద్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో బోయిన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచి గెలవాలని ప్రోత్సాహాన్ని నింపారు. విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించేందుకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాముండేశ్వరి పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం అని, క్రీడల నైపుణ్యం కోసం పిల్లలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ లీల విద్యార్థులకు మనోధైర్యం నింపి, కబడ్డీ ఆటలో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.