మన్సూరాబాద్, ఫిబ్రవరి 14: విదేశాలకు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసుల సహకారంతో నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 55 లక్షల విలువైన 500 గ్రాముల సుడోఇఫెడ్రైన్ (హై సింథటిక్ డ్రగ్) మాదక ద్రవ్యం, 80 గ్రాముల బంగారం, 2 సెల్ఫోన్లు, రూ. 2,500 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర, పుణె సిటీకి చెందిన షేక్ ఫరీద్ మహ్మద్ అలీ (30) వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన ఫైజన్ అరుణ్ ముజాహిద్ అలియాస్ ఫైజల్ (28) స్నేహితులు. షేక్ ఫరీద్ మహ్మద్ అలీ తన సోదరి నివాసముండే చెన్నై నగరానికి తరచూ వస్తుంటాడు. అతడి బావ బషీర్‌అహ్మద్ ఫారన్ గూడ్స్ బిజినెస్ చేస్తుంటాడు. బావ సహాయంతో మలేషియా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తెప్పించుకుని చెన్నైలో విక్రయిస్తుంటాడు. షేక్ ఫరీద్ మహ్మద్ అలీ తన స్నేహితుడైన ఫైజల్‌ను బావ బషీర్ అహ్మద్‌కు పరిచయం చేశాడు. చెన్నైలో డ్రగ్స్ వ్యాపారం చేసే రసూల్దీన్ను షేక్‌ఫరీద్ మహ్మద్, ఫైజల్‌కు బషీర్‌అహ్మద్ పరిచయం చేశాడు. షేక్‌ఫరీద్ మహ్మద్, ఫైజల్, రసూల్ దీన్తో పాటు మహ్మద్ ఖాసీం అనే వ్యక్తితో కలిసి నలుగురు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేయడం మొదలు పెట్టారు.
నిందితులు పలుమార్లు పుణె నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు డ్రగ్స్ సరఫరా చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో గత డిసెంబర్లో రసూల్దీన్, మహ్మద్ ఖాసీంను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో షేక్‌ఫరీద్ మహ్మద్, ఫైజల్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీ ద్వారా పార్సిల్స్‌ను పంపుతుండగా.. షేక్‌ఫరీద్ మహ్మద్, ఫైజల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుడో ఇఫెడ్రైన్ (హై సింథటిక్ డ్రగ్) డ్రగ్‌లో కెమికల్స్ కలిపి ఎండీఎంఏగా.. మరో డ్రగ్‌గా మార్చి కిలోను రూ.8 నుంచి 10 కోట్ల వరకు విదేశాలకు సరఫరా చేస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్మగ్లింగ్ చేస్తుంటారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ ఆర్.గిరిధర్, నాచారం ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ.రాములు పాల్గొన్నారు.