వెంగళరావునగర్, జూన్ 8 : తోడబుట్టకున్నా.. అంతకు మించిన బంధం..మహిళా కార్యకర్తల్ని చెల్లెమ్మలు, అక్కలుగా ఆదరించి ఆప్యాయతానురాగాలు పంచారు బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. బోరబండ వాసుల కష్టసుఖాల్లో తోడై నిలిచారు. మాగంటి ఆకస్మిక మృతి చెందడంతో మాదాపూర్‌లోని నివాసంలో మాగంటి గోపీనాథ్ పార్థీవదేహానికి బోరబండ వాసులు నివాళులర్పించారు.
అక్కడికి వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో తమగోడు వెల్లబోసుకున్నారు. కష్టజీవులైన బోరబండ వాసుల ఇళ్ల కూల్చివేతల్ని అడ్డుకోవడానికి మాగంటి చివరిదాకా పోరాడారని, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపారన్నారు.
ఇక నుంచి బోరబండలో ఏ పేదోడి ఇల్లు కూల్చనియ్యనని.. ఎందాకైనా పోరాడుతానని మాగంటి చెబుతూ ఉండేవారని బోరబండ మహిళలు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత దృష్టికి తీసుకెళ్లారు. బోరబండలో అరాచకాలు, దౌర్జన్యాలు పెట్రేగిపోయాయని..మాగంటి మృతితో మాకు అండ కూడా లేకుండా పోయిందని విలపించారు. ‘మా బతుకులు ఆగమైపోతున్నాయి.. ఇక మాకు దిక్కులేకుండా పోయింద’ని బోరబండ బస్తీల మహిళలు రోదించారు.
చెమ్మగిల్లిన చెల్లెమ్మలు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ను పార్టీలోని మహిళా కార్యకర్తలైన ఆడపడుచులు ప్రేమగా గోపన్న అని పిలుచుకుంటారు. ఆడపడుచుల ఆ ప్రేమాభిమానాలే ఆయన్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేశాయి. మూడుసార్లు వరుసగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అహర్నిశలు పేదోళ్ల గురించే మాగంటి ఆలోచనలు.
ఈ గరీబోళ్ల కు ఇల్లు లేకుండా చేయాలనే కుట్రలు, కుతంత్రాలు పన్నిన స్వార్థ రాజకీయాలపై చివరిదాకా పోరాడారు. ఆ పోరాటంలో ఆయన తన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. పట్టించుకోలేదని బోరబండ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని తమను రక్షించాలని వేడుకున్నారు. స్పందించిన కేటీఆర్ అండగా ఉంటామని భరోసా కల్పించారు. రోదిస్తున్న బాధిత మహిళలను కేటీఆర్ ఓదార్చారు. జూబ్లీహిల్స్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని స్పష్టంచేశారు.