సిటీ బ్యూరో, జూలై 14: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆగడాలతోనే బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్ధార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రుజువు చూపే ఆడియో సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతోంది. సర్ధార్ చిననాటి స్నేహితుడు ఖయ్యూమ్‌తో గతంలో జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఇప్పుడు వెలుగుచూసింది. నీపై బాబా పగబట్టాడు… కక్షతో రగిలిపోతున్నాడంటూ సర్ధార్‌తో ఖయ్యూమ్ మాట్లాడారు..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ అనుచరుడు బాబా బాల్య మిత్రుడైన ఖలీల్కే దిక్కులేకుండా పోయింది… దీంతో బాబాకు భయపడిపోయిన ఖలీల్ ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్‌లోకి చేరిపోయాడు… మన్సూర్‌తో పాటు మరికొందరు మిత్రులకు కూడా ఫోన్లు చేసి సర్ధార్‌తో మాట్లాడొద్దని..అతన్ని కలవడానికి వీల్లేదని బాబా బెదిరింపులకు గురిచేసినట్లు ఖయ్యూమ్ చెప్పాడు.
బాబా దుర్మార్గాలపై సర్ధార్, అతని మిత్రుడు ఖయ్యూమ్ల సంభాషణ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. చివరికి చచ్చేదాకా వెంటాడి సర్ధార్ బలవన్మరణానికి బాబానే కారణమయ్యాడని..బాబాతో పాటు అతని భార్య హబీబాసుల్తానా, బాబా పీఏ సప్తగిరి వేధింపులే కారణమని పోలీసులకు గతంలో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఆ కేసులో పురోగతి లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆధారాలున్నాఅరెస్ట్ చేయరా..?
అంతులేని ఆగడాలు.. దౌర్జన్యాలు సాగించే బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దాదాగిరిపై ఆధారాలున్నా అరెస్టు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నేతృత్వంలో మృతుడు సర్ధార్ కుటుంబీకులతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను గతంలో కలిశారు. అయినా ఈ కేసులో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా పోవడం విమర్శలకు తావిస్తోంది. నేరుగా సర్ధార్ ఇంటికే వచ్చి బాబా దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగినా ఇప్పటికీ చట్టరీత్యా చర్యల్లేకపోవడం గమనార్హం.
బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరా…
బీఆర్ఎస్ బోరబండ మైనార్టీ నాయకుడు సర్ధార్ బలవన్మరణానికి కారకుడైన బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బహిరంగంగా తిరుగుతున్నా అదుపులోకి తీసుకోకుండా పోలీసులు గులాంగిరి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బాబాతో పాటు..అతని భార్య హబీబాసుల్తానా, పీఏ సప్తగిరిలు గతంలో పలుమార్లు సర్ధార్ ఇంటికొచ్చి బెదిరింపులకు దిగారని మృతుడి కుటుంబీకులు చెప్తున్నా..పోలీసులు చెవికెక్కించుకోవడం లేదని వాపోతున్నారు.
బాబా బహిరంగంగా రోడ్లపై తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా..అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం పోలీసుశాఖపై నమ్మకం సన్నగిల్లుతుందని విమర్శలు వస్తున్నాయి. సీజ్ చేసిన మృతుడి ఫోన్ నంబర్లో లభించిన ఆధారాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
బాబా వెనుక అదృశ్య ‘హస్తం’
మామూళ్ల డబ్బు ఇవ్వలేదన్న కక్షతో సర్ధార్ ఇంటిని మున్సిపల్ అధికారులతో కూల్చి వేయించి..బెదిరింపులకు దిగి అతని ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వెనుక అదృశ్య ‘హస్తం’ పనిచేస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంతటి దౌర్జన్యాలు, దుర్మార్గాలకు ఒడిగట్టిన బాబా ఫసియుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారేమోనని ఆ పార్టీలోని వారే చాలామంది ఎదురుచూశారు.. కానీ బాబాపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి పరాకాష్టగా నిలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
బాబా వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డ సర్ధార్ మృతిపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు వచ్చి పరామర్శించి మొసలి కన్నీరు కార్చి మైనార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు నడిపారని బాధితు లు విమర్శిస్తున్నారు. దాదాగిరి చేసే బాబాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క కాంగీయుడు బహిరంగంగా కోరకపోవడం..తమకెందుకులే అని ఎవరికివారే మిన్నకుండిపోయారు. బాబాపై పార్టీ పరంగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుంది.