కవాడిగూడ, డిసెంబర్ 27:హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో పుస్తక ప్రియులు సందడి చేశారు. పుస్తకాలు చదవడం ద్వారా మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని ప్రజా కవి అందెశ్రీ ప్రాంగణంలో కొనసాగుతున్న 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను శనివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలు సందర్శించారు. పలు స్టాల్స్‌లో పుస్తకాలను పరిశీలించిన వారు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాటాడుతూ ఎమర్జెన్సీ సమయంలో తాను జైల్లో ఉన్నప్పుడు భగవద్గీత తనకు జీవిత పరమార్థాన్ని బోధించిందన్నారు.
కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో మహాభాగవతం చదవడం వల్ల ధైర్యం, శక్తి లభించాయని చెప్పారు. మనం ఎంత చదివితే అంత వినమ్రత పెరుగుతుందని, రాత్రి వేళల్లో ఇప్పటికీ తాను చదవడానికి సమయం కేటాయిస్తానని తెలిపారు. తన జీవితంలో నెపోలియన్ ది గ్రేట్ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయన నిఘంటువులో అసాధ్యం అనే పదమే లేదన్న స్ఫూర్తితోనే తాను సమాజసేవలో నిమగ్నమయ్యానని చెప్పారు. పేదలను సమానంగా చూసే సామాజిక దృక్పథం పుస్తకాలతోనే సాధ్యమని దత్తాత్రేయ తెలిపారు. ఈ సందర్భంగా బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవియాకూబ్, ప్రధాన కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డిలు బండారు దత్తాత్రేయను శాలువాతో సత్కరించి భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహూకరించారు.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన విభిన్న అభిప్రాయాలకు, భావజాలాలకు వేదికగా నిలిచిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుక్ఫెయిర్లో సావర్కర్,గాంధీ, మార్క్స్ వంటి విభిన్న ధృవాలైన ప్రముఖుల రచనలు అందుబాటులో ఉండటం అభినందనీయమన్నారు. బుక్ఫెయిర్లో శనివారం సాయంత్రం అనిశెట్టి రజిత వేదికపై జరిగిన పుస్తక స్ఫూర్తి చర్చా కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్, కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ సామాన్య రైతుబిడ్డనైన తాను నేడు ప్రముఖ ఎడిటర్ల సరసన కూర్చునే అర్హత సాధించానంటే అది కేవలం పుస్తకంతోనే సాధ్యమైందన్నారు.
ప్రస్తుతం యువత డిజిటల్ కంటెంట్‌కు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఫిజికల్ పుస్తకాల వాడకం తగ్గుతున్నట్లు కనిసిస్తున్నా పుస్తకం ఇచ్చే సంస్కారం, విలువలు ఎన్నటికీ మారవని స్పష్టం చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని డిజిటల్ విప్లవాలు వచ్చినా కాగితపు పుస్తకం ఇచ్చే అనుభూతిని మరేదీ భర్తీచేయలేదన్నారు. ప్రముఖ పాత్రికేయులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నిరంతర అధ్యయనం లేనివారు ఉత్తమ పాత్రికేయులుగా రాణించలేర్నారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు మాట్లాడుతూ సామాన్యుడి జీవితాన్ని పుస్తకమే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. పేదరికాన్ని జయించే అసలైన ఆయుధం అక్షరజ్ఞానమేనని తెలిపారు.
అనంతరం సిటీ కళాశాల తెలుగు ప్రొఫెసర్లు డాక్టర్ కోయి కోటేశ్వర్రావు, డాక్టర్ జె.నీరజల సమన్వయంలో జరిగిన విద్యా సదస్సులో పలు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థులు జి.సౌజన్య, చిక్కొండ్ర రవి, చుక్క వంశీ, కావ్య, సన్నిత, భవానిలు పాల్గొని తాము చదివిన పుస్తకాలు తమకు ఎలా దిశానిర్ధేశం చేసాయో వివరించారు. అలాగే బుక్పెయిర్లోని కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికపై పలు పుస్తకావిష్కరణలు జరిగాయి.
కవి, విమర్శకులు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ సదస్సు పత్రాలు వల్లంపట్ల సాహిత్యం సామాజికచైన్యం గ్రంథావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాల లింగమూర్తి రచించిన ‘మళ్ళీ పెళ్ళి కథలు కథల సంపుటి, అమ్మతోడు అరుణా వచ్చే జన్మలో ఈ తప్పులు చేయను’ కవితా సంకలనాలను ఆవిష్కరించారు. ఇంద్రవెళ్ళి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆచార్య కోదండరాం పాల్గొని హోప్ ఆఫ్ ది నేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్‌రెడ్డి శనివారం రాత్రి సందర్శించారు. పలు స్టాళ్లను తిరిగి పుస్తకాలను పరిశీలించిన డీజీపీ నిర్వాహకులు యాకూబ్, వాసు, రాఘవేంద్రరావులతో మాట్లాడి అకడి విషయాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఐజీ ఎం.రమేష్ ఉన్నారు.