కవాడిగూడ, డిసెంబర్ 28: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంలో కొనసాగుతున్న 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు విద్యార్థులు, యువత పోటెత్తుతున్నారు. సోమవారంతో బుక్‌ఫెయిర్ ముగియనుండటంతో ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో సాగిన బుక్‌ఫెయిర్‌కు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడం కనిపించింది. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత పుస్తకాలపై ఆసక్తిని కనబర్చడం ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు కవులు, రచయితలు పేర్కొంటున్నారు. ఇప్పటికే బుక్‌ఫెయిర్‌ను 12 లక్షలకు పైగా పుస్తకాభిమానులు సందర్శించారని ఇందులో అధికంగా యువత, విద్యార్థులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుందని బుక్‌ఫెయిర్ నిర్వాహకులు పేర్కొన్నారు. బుక్ఫెయిర్లో భాగంగా ఆదివారం రాత్రి అనిశెట్టి రజిత ప్రధాన వేదికపై జరిగిన పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి, మాడభూషి శ్రీధర్, గోరటి వెంకన్న, రమామెల్కోటే పాల్గొన్నారు.
పుస్తకం వినమ్రతను నేర్పుతుంది..
ఈ సందర్భంగా ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడమే నిజమైన జ్ఞానమని అన్నారు. పుస్తకం మనిషిని అహంకారం నుంచి విముక్తుడిని చేసి వినమ్రతను నేర్పుతుందని చెప్పారు. చిన్నతనంలో వేమన శతకం, కాళీదాసు తత్వాలతో మొదలైన తన పఠనాసక్తి.. మార్క్సిజం, టాల్‌స్టాయ్, ప్రేమ్‌చంద్ వంటి ప్రపంచ సాహిత్యం వకరు విస్తరించిందన్నారు. జిడ్డు కృష్ణమూర్తి సిద్దాంతాలు తనలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయన్నారు. కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడబూషి శ్రీధర్ మాట్లాడుతూ.. పుస్తకం కేవలం అక్షరాల సమాహారమే కాదని, అది మనిషిలోని విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని మేల్కొలిపి సమాజ సేవకు పురిగొల్పే ఒక గొప్ప ఆయుధమన్నారు. సిద్ధ పురుషులు పుస్తకంలో రామానుజులవారు గోపురం ఎక్కి రహస్య మంత్రాలను బహిరంగంగా ప్రకటించిన ఉదంతం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఆయననే తాను తొలి సమాచార హక్కు కార్యకర్తగా భావిస్తానని తెలిపారు.
సీనియర్ పుస్తకాలు ఆలోచన ధోరణిని మారుస్తాయి..
పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ.. జీవన పయనంలో ఎదురయ్యే సంక్షోభాల సుడిగుండాల నుంచి గట్టెక్కించి సరైన దిశను చూపే లైట్‌హౌజ్ వంటిది పుస్తకం అని అభివర్ణించారు. మనం ఎంచుకునే పుస్తకాలే మన ఆలోచనా ధోరణిని మార్చి సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. రమామెల్కోటే మాట్లాడుతూ.. పుస్తక పఠనం మనిషి ఆలోచనా విధానాన్ని మార్చి జీవితానికి కొత్త దిశను చూపుతుందని చెప్పారు. విభిన్న భావజాలాల పుస్తకాలను చదవడం ద్వారానే సత్యాన్ని గ్రహించే విచక్షణాజ్ఞానం లభిస్తుందన్నారు.
పుస్తకాన్ని చదివి వదిలేయకుండా అది చూపే మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌లు చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారిని సత్కరించారు. బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్అస్మారషీద్ ఆధ్వర్యంలో జరిగిన డిఫరెంట్ చైల్డ్హుడ్స్ చర్చా కార్యక్రమంలో డాక్టర్ షెఫాలిఝూ, డాక్టర్ గోగుశ్యామల, కనీజ్ఫాతిమా, డాక్టర్ మధుమిత సిన్హా, డాక్టర్ ఉమాభృగుబండలు పాల్గొన్నారు. పుస్తక స్ఫూర్తి పాట కార్యక్రమం బుక్ఫెయిర్లో అందిరినీఆకట్టుకుంది. కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికపై పగిడి తెలంగాణ కథ 2024, వారుణి వాహిని, ఫైజ్ అహ్మద్ ఫైజ్ పుస్తకాలను ఆవిష్కరించారు.