Bonalu Festival | గోల్నాక, జూలై 17: హైదరాబాద్ అంబర్పేట పరిధిలో ఈ నెల 20న ఆదివారం నాడు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీశ్ కుమార్ సూచించారు. గురువారం అంబర్పేట ఏకే ఫంక్షన్ హాల్లో అంబర్ పేట ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన బోనాల పండుగ నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏసీపీ హరీశ్ కుమార్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుంటా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బోనాల పండుగ నిర్వహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురి కాకుండా షీ టీమ్స్ బృందాలు విధుల్లో ఉంటాయని తెలిపారు.
సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. బోనాల పండగ సందర్భంగా ఫలహారపు బండ్లు, అమ్మవార్లకు తొట్టెల సమర్పించే నిర్వహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అలాగే బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, సెల్ఫోన్లు చోరీ జరిగే అవకాశాలున్నాయని, వాటి పట్ల అప్రమ్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు.