చార్మినార్, ఫిబ్రవరి 19 : సిటీ సివిల్ కోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నాం ఇక ఆపడం అసాధ్యమే అంటూ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డికి ఓ అగంతకుడు మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది వెంటనే మీర్‌చౌక్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి డాగ్ స్వాడ్‌తో పాటు మీర్‌చౌక్ పోలీసులు సిటీ సివిల్ కోర్టుకు చేరుకున్నారు. అప్పటికే కోర్టుల్లోని వివిధ విభాగాల్లో కేసులను పరిష్కరించడానికి సిద్దంగా ఉన్న న్యాయమూర్తులతోపాటు సిబ్బంది, న్యాయవాదులు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
వారికి పోలీసులు, బాంబ్ స్కాడ్ సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందవద్దని, కోర్టుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు విషయాన్ని నిగ్గుతేలుస్తామని హామీనిస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ప్రతి హాలును, పార్కింగ్ ప్రాంతాలను బాంబ్ స్కాడ్, డాగ్ స్వాడ్లతో అడుగడుగునా తరచి చూస్తూ సోదాలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించకపోవడంతో ఉత్తిత్తి బాంబు బెదిరింపుగా తేలిపోయింది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదుల్లో ఆందోళన తొలగింది. అప్పటి వరకు ఎంతో టెన్షన్ అనుభవించామని పలువురు న్యాయవాదులు తెలిపారు. మెయిల్ ద్వారా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందిన సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించేందుకు సైబర్ పోలీసుల సహకారం తీసుకుని విశ్లేషన చేస్తున్నామని మీర్‌చౌక్ ఇనస్పెక్టర్ రెహ్మాన్ తెలిపారు.