సిటీ బ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జలమండలిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించేందుకు బోర్డు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్లు కూడా పిలవడంతో వచ్చేనెల నుంచే కొత్త సిబ్బంది అందుబాటులోకి రానున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. నామమాత్రపు వేతనాలతో పదేండ్లకు పైగా జలమండలినే నమ్ముకుని ఉన్న 673 మంది భవితవ్యం అంధకారంలో పడనుంది. మీటర్ రీడర్లు చాలీచాలని వేతనాలతో నగరంలోని ప్రతి ఇంటికీ తిరిగి మంచినీటి బిల్లులు వసూలు చేస్తూ జలమండలి ఆర్థికంగా పురోగమించేందుకు తోడ్పడుతున్నారు.
తక్కువ జీతాలతో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుతున్న మీటర్ రీడర్లను ఎందుకు తొలగిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు బోర్డులో ఉన్న ఇతర సమస్యలను పక్కనపెట్టి చిరుద్యోగులైన మీటర్ రీడర్లను ఇబ్బందులకు గురి చేయడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాశ్వత ఉద్యోగులు కాకపోయినా వారితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారిని తొలగించాలనుకోవడం కక్ష సాధింపుగా ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఈడీ పొదుపు పేరిట తక్కువ జీతానికే పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించడం వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ జలమండలిలో జరుగుతున్నది.
తొలగింపు వెనుక ఈడీ!
జలమండలిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించాలనే నిర్ణయం ఈడీదేననే చర్చ జలమండలిలో జోరుగా సాగుతున్నది. జలమండలిలో రెవెన్యూ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఈడీ మయాంక్ మిట్టల్ ఖర్చులు తగ్గించే నెపంతో సిబ్బందిపై అకారణంగా కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో కింది స్థాయి అధికారులను వేధింపులకు గురి చేయడంతో పాటు తాత్కాలిక, పొరుగు సేవల ఉద్యోగులను ఎలా తొలగించాలనే నెపంతో మీటర్ రీడర్లను బలి చేస్తున్నారనే చర్చ జలమండలిలో జోరుగా సాగుతున్నది.
ఈడీ మాయంక్ మిట్టల్ ఇప్పటికే అకారణంగా ఓ చిరుద్యోగిని విధుల్లోంచి తొలగించారని విశ్వసనీయ సమాచారం. రెవెన్యూ విభాగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్డుకు ఖర్చులు తగ్గించాలనే నెపంతో నియంతలా వ్యవహరిస్తూ చిరుద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిసింది. ఈ వ్యవహారం జలమండలిలో తీవ్ర చర్చనీయాంశమైంది. మీటర్ రీడర్లను కూడా అందులో భాగంగానే తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్.
రోడ్డున పడేయొద్దు..మీటర్ రీడర్ల ఆవేదన
పదేండ్లకు పైగా జలమండలికి సేవలందింస్తున్న మీటర్ రీడర్లను అకారణంగా రోడ్డున పడేయొద్దని కోరుతున్నారు. విధుల్లోకి తీసుకునేటప్పుడు ఔట్ సోర్సింగ్ అని చెప్పి.. ఇప్పుడేమో ‘యాక్టివిటీ’ అనే పదాన్ని చేర్చి తమను విధుల్లోంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల 673 మంది జీవితాలు ప్రశ్నార్థకమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలిలోని అన్ని విభాగాల సిబ్బంది కంటే తక్కువ జీతంతో సేవలందిస్తున్నా తొలగించడం వెనుక మర్మమేంటని అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. అన్ని విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది లాగానే తమను కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మండలి ఎండీ అశోక్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమకు అన్యాయం చేయాలని కోరుతున్నారు. మీటర్ రీడర్లను విధుల్లోంచి తొలగించి రోడ్డున పడేయొద్దని వేడుకుంటున్నారు. కొద్దిపాటి ఆసరా లేకుండా చేసి తమ జీవితాలను బలి చేయొద్దని కోరుతున్నారు.