‘మన తెలంగాణలో పెద్ద పండుగ దసరా..చేసుకుందామంటే ఊరికి పోలేం.. ఇక్కడ ఉండలేం. సర్కారు మా బతుకుల్లో మట్టిగొట్టింది. అసలు బతుకే లేకుండా చేసింది. పోయిన ఏడాది ఇదే టైంకు ఊళ్లో దసరా పండుగ చేసుకుంటున్నం. ఇప్పుడు మా గతి ఇట్లయిపాయె.. రేవంత్‌రెడ్డికి మేం ఏం అన్యాయం చేసినం. మా మీద పగబట్టిండు. పిల్లగాళ్లు దసరా చేసుకుందం.. ఊరికి పోదాం పాండి అంటే చేతిలో చిల్లిగవ్వ లేకపాయె. ఉన్న ఇల్లు కూలిపాయె. ఎక్కడికని పోవాలే. ఎట్ల బతకాలే.
మా జీవితాలు ఆగమైనయ్. పండుగ సంబురమే లేదు. సర్కారోళ్లకు మాపైన కనికరమే లేదు. మా గూడు కూలగొట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు’…హైడ్రా కూల్చివేతల్లో సర్వం కోల్పోయిన సున్నం చెరువు, నల్ల చెరువు బాధితుల ఆవేదన ఇది. ఎటుచూసినా కూలిపోయిన ఇండ్లు.. పడిపోయిన శిథిలాలు.. చిమ్మచీకట్లు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుంటే తామెలా బతుకాలో.. తామెక్కడకు పోవాలో తెలియని దుస్థితి.. అధికారులు బలవంతంగా ఖాళీ చేయించాలని చూసినా.. అక్కడి నుంచి వెళ్లే అవకాశం లేక అదే ప్రాంతంలో బతుకులీడుస్తున్న సామాన్యుల బాధ ఇది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 11 ( నమస్తే తెలంగాణ)
సున్నంచెరువు, నల్లచెరువు, ఇలా చాలా ప్రాంతాల్లో హైడ్రా దూకుడుగా వ్యవహరించిన తీరుతో బాధితులు విలవిలలాడిపోతున్నారు. ఎటుపోవాలో దిక్కుతోచక..రెక్కాడితే కానిడొక్కాడని జీవన పరిస్థితులను మార్చుకోలేక హైడ్రా కూల్చివేసిన ఇండ్ల శిథిలాల మధ్యే జీవనం కొనసాగిస్తున్నారు. హైడ్రా 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసింది. సున్నంచెరువు, నల్లచెరువు.. ఇలా కూల్చిన ప్రతిచోటా శిథిలాలు అలాగే పడి ఉన్నాయి.
గత రెండు నెలలుగా తామెక్కడకు పోవాలో.. ఎక్కడ బతుకాలో తెలియక తమ ఇండ్ల శిథిలాల మధ్యే దుర్భర జీవనం సాగిస్తున్నారు బాధితులు. కరెంట్ మీటర్లు తీసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా చీకటిమయమైంది. రాత్రైతే తాత్కాలిక గుడిసెల్లో పాముల భయం, దోమల బాధతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దసరా పండుగ వస్తే ప్రతిసారి తమ ఊళ్లకు పోయి పండుగ బాగా జరుపుకునేటోళ్లమని, ఈసారి ఆ అదృష్టం తమకు లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.
సుమారుగా మూడు నెలల కాలంలో హైడ్రా జరిపిన కూల్చివేతలకు సంబంధించిన శిథిలాలు ఎక్కడివక్కడే పడేసి ఉన్నాయి. కూల్చివేతలు, తొలగింపునకు సంబంధించి హైడ్రా గత నెలలో ఆఫ్‌లైన్ టెండర్లను పిలిచింది. ఈప్రక్రియ సెప్టెంబర్ 27తో ముగిసింది. అయితే ఇప్పటివరకు ఏ సంస్థకు టెండర్లు ఫైనల్ కాలేదని తెలిసింది.
మా బతుకులను రోడ్డు పాలు చేసిండ్రు. మేం మా పిల్లలతో పాటు రోడ్డున పడ్డం. దసరాకు ఊరికి పోదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.
దసరా పండుగ వస్తే ఇనామ్ తీసుకుంటం కదా.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాకు ఈ ఇనామ్ ఇచ్చిండు. మీరు ఇండ్లల్లో ఎందుకుండాలె. రోడ్డుమీదైతే బాగుంటదని ఉన్న ఇల్లు కూలగొట్టించిండు. దసరా గిైట్లెపోయింది.
ఇల్లు మొత్తం కూలగొట్టిరి.. ఇగ పండుగ ఎక్కడిది. ఎక్కడ చూసినా రాళ్లే కనిపిస్తున్నయ్. మా బతుకు మొత్తం ఈ రాళ్ల మధ్యల అయిపోయింది. రాళ్ల మధ్యల నడుస్తుంటే నా చేయికి దెబ్బ తాకింది. కట్టు కట్టుకుని ఉన్న. పిల్లగాళ్లు దసరాకు ఊరికిపోయేటోళ్లు. ఈసారి మా ఇల్లు కూలగొట్టిండ్రు. కట్టుబట్టలతోని బయటకు వచ్చినం.
ఇళ్లు కూలగొట్టి పోయిండ్రు. మేం ఎక్కడికి పోవాల్నో తెలవట్లేదు. ఇక్కడనే చిన్న గుడిసె వేసుకుని ఉన్నం. నా భార్య గర్భిణి. నాకు చిన్న పిల్లగాడు. వీళ్లతోని ఈ రాళ్ల మధ్యల చీకట్ల బతకాలంటే భయమైతుంది. కరెంటు కట్ చేసిండ్రు. పాములు, దోమలు.. ఇక్కడంతా దుమ్ము. రాత్రైతే చిమ్మచీకట్లో బయటకి పోదామన్నా.. భయమైతున్నది.