Crime News | బంజారాహిల్స్,నవంబర్ 1: ప్రేమిస్తున్నానని యువతిని నమ్మించాడు. రహస్యంగా పెళ్లి చేసుకొని ఆమె వెంట విదేశాలకు వెళ్లాడు. అక్కడ వేధింపులకు పాల్పడి రూ.1.25 కోట్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న కాసోజు వైష్ణవి (24)కి 2020లో ఫేస్బుక్ ద్వారా కీసర పరిధిలోని నాగారం ఎస్సీ కాలనీకి చెందిన కొండపాక ఉమాపతి (30) పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. అప్పుడప్పుడూ తనకున్న ఆర్థిక సమస్యలను చూపిస్తూ.. పలుమార్లు వైష్ణవి వద్ద నుంచి డబ్బులు తీసుకున్న ఉమాపతి తిరిగి ఇస్తానంటూ కాలయాపన చేశాడు.
కొన్నాళ్ల తర్వాత డబ్బుల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, కుటుంబ పరువును మంటగలుపుతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి బారినుంచి తప్పించుకునేందుకు, ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లేందుకు వైష్ణవి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఉమాపతి పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేయడంతో పాటు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
దీంతో 2022, ఎప్రిల్ 20న స్నేహితుల సమక్షంలో ఆర్య సమాజ్లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం ఇంట్లో చెప్పకుండా దాచారు. వైష్ణవికి బ్రిటన్ వీసా వచ్చిన తర్వాత తాను కూడా డిపెండెంట్ వీసాపై బ్రిటన్ వస్తానని చెప్పి.. ఇందుకు నాగారం సబ్ రిజిస్టర్ కార్యాయంలో పెళ్లి ఫొటోలు పెట్టి రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటన్ వెళ్లగా.. అక్కడ విలాసవంంతమైన జీవితం గడపుతూ వైష్ణవి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.
శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు సుమారు రూ.1.25 కోట్లు ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో.. ఈ ఏడాది ఆగస్టులో వైష్ణవి ఇండియాకు తిరిగి వచ్చింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. ఉమాపతితో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడు నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో పాటు తన జోలికొస్తే అట్రాసిటీ కేసు పెట్టి కుటుంబ సభ్యులందరినీ జైలుకు పంపిస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు గురువారం రాత్రి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.