Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 16 : జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. పేదలకు కేటాయించిన వాంబే గృహాలను కొనుగోలు చేసేందుకు వీలులేకున్నా అడ్డదారిలో కొనుగోలు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరంతస్థుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని హైకోర్టులో ఆదేశాలు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏకంగా రాష్ట్ర శాసనసభలో సైతం ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే లేవనెత్తినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్‌లో బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన బీజేపీ నేత హెచ్.వెంకట్‌రెడ్డి గత కొంతకాలంగా సుమారు 180 గజాల్లో 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ స్థలంలో గతంలో పేదల కోసం (బీపీఎల్) వాంబే ఇండ్లు ఉండేవి. ఎస్సీ, బీసీలకు చెందిన పేదలకు గత ప్రభుత్వాల హాయంలో ఇచ్చిన ఇండ్లను బీజేపీ నేత వెంకట్‌రెడ్డి అక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు ఈ స్థలంలో సుమారు 60 గజాలను జీవో 59 కింద తన భార్య నర్మద పేరుతో క్రమబద్దీకరణ చేయించుకున్నారు. రెవెన్యూ నిబంధనల ప్రకారం వాంబే గృహాలను లబ్దిదారుల కుటుంబాలు మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప వేరేవారికి అమ్మరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయినా తప్పుడు సమాచారం ఇచ్చి 60 గజాలను జీవో 59 కింద క్రమబద్దీకరణ చేయించుకున్న వెంకట్‌రెడ్డి మిగిలిన స్థలాన్ని కలుపుకుని ఇటీవల బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు.
దీంతో బస్తీవాసులు జీహెచ్ఎంసీకి, షేక్‌పేట మండల తహసీల్దార్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులకు ముడుపులు చెల్లించి అక్రమ నిర్మాణాలను ఉపేక్షిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ఇటీవల స్థానికంగా నివాసం ఉంటున్న కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా వెంటనే అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కూల్చివేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ సర్కిల్-18 డిప్యుటీ మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే నిర్మాణదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపడతామని స్పీకింగ్ ఆర్టర్స్ జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కిన నిర్మాణదారులు పనులు కొనసాగిస్తున్నారు. ఆదేశాలు జారీ చేసి రెండునెలలు గడిచినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల వ్యవహారశైలిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదవాడు చిన్నతప్పు చేస్తే జేసీబీలతో విరుచుకుపడే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు రాజకీయనాయకులు చేస్తున్న అక్రమాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారుల తీరుపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ప్రస్తావించడం గమనార్హం. ఇదిలా ఉండగా మొత్తం స్థలంలో 60గజాలను జీవో 59 కింద క్రమబద్దీకరణ చేయించుకున్న వెంకట్‌రెడ్డి మరో 120 గజాల స్థలాన్ని లబ్దిదారులనుంచి అక్రమంగా తీసుకున్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ఇప్పటికే షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. సదరు స్థలంలోని బిల్డింగ్‌ను సీజ్ చేయాల్సిన రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిలింనగర్‌తో పాటు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో సైతం వెంకట్‌రెడ్డి ఇదే విధంగా ఎస్సీలకు చెందిన స్థలాలను అడ్డదారిలో క్రమబద్దీకరణ చేయించుకున్నారని, కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయని తెలుస్తోంది. పలు బస్తీల్లో ఆయన పేదలకు అప్పులు ఇచ్చి వారి పట్టాలను తీసుకుని ఇండ్లను నామమాత్రపు మొత్తం ఇచ్చి ఇండ్లను కాజేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా స్థలం కొన్నట్లు తేలింది..
ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్‌లో పేదల కోసం గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాన్ని వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసినట్లు మా విచారణలో తేలింది. కొంత స్థలాన్ని జీవో 59కింద క్రమబద్దీకరణ చేయించుకున్నా, క్రమబద్దీకరణ చేయించుకోని స్థలంలో అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేసినట్లు గుర్తించాం. ఒకట్రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం. పేదలకు ఇచ్చిన స్థలాన్ని కొనుక్కోవడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. స్థలాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటాం.
-షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి