సిటీబ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రెండు జాతీయ పార్టీల లోపాయికారి ఒప్పందం బట్టబయలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో, ఖాళీ అయినా స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీ భావాలకు విరుద్ధంగా కలిసి పనిచేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థి ఖరారు నుంచి ప్రచారం దాకా అస్త్రశస్ర్తాలను సంధించాల్సిన బీజేపీ.. చేతులు కట్టుకొని ఎన్నికల బరిలో నిలిచింది. ఈ తరహా రాజకీయ విన్యాసం పార్టీకి నష్టం చేస్తుందని సొంత నేతలే మొత్తుకుంటున్నా.. కాంగ్రెస్ సర్కారులోని పెద్ద మిత్రుల కోసం పార్టీని కమలం రాష్ట్ర నేతలు బలిపీఠం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీని గెలిపిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కానీ ఆ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న అసలు విషయం క్రమంగా వెలుగులోకి వస్తోంది. కాంగ్రెస్ సర్కారుతో కమలం పెద్దల లోపాయికారి ఒప్పందం పార్టీకి తీరని నష్టమే జరుగుతోంది.
ఓవైపు బీఆర్ఎస్ సొంత స్థానం కాపాడుకునేందుకు, కాంగ్రెస్ కొత్త స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలో నిలిస్తే అదే స్ఫూర్తితో పోటీ చేయాల్సిన బీజేపీ ఆ విషయాన్ని మరచింది. దీంతో అభ్యర్థిని ఖరారు చేయడంతోనే లోపాయికారి ఒప్పందానికి అనుగుణంగా లెంకల దీపక్‌రెడ్డిని బరిలో దింపింది. అప్పటినుంచి ఇప్పటివరకు జరుగుతున్న ప్రచార పర్వం వరకు అన్ని కూడా కాంగ్రెస్‌ను లబ్ధి చేకూర్చేలా ఆ పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయనే విమర్శలు ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఓట్లను మళ్లించుకునేందుకు గతంలో ఈ తరహా రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్-ఎంఐఎం నడుమ సాగుతుండేవి. అభ్యర్థి గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపితే.. ఎంఐఎం బలమైన నాయకుడిని బరిలో దింపేది. ఇలా ప్రత్యర్థి ఓట్ల చీల్చడమే లక్ష్యంగా పనిచేసేవి. తాజాగా అదే తరహా వ్యూహాన్ని బీజేపీ-కాంగ్రెస్ అమలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
అందుకే బరిలో బలమైన నేతకు బదులుగా సాదాసీదా కార్యకర్తను బరిలో దింపిన బీజేపీ.. బీఆర్ఎస్ వైపు ఉన్న మైనార్టీల ఓట్లను ప్రభావితం చేస్తోంది. ఇక బీజేపీ బాటలోనే ఎంఐఎం కూడా ఈసారి అభ్యర్థిని బరిలో దింపకుండానే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల రణరంగంలో బీజేపీ చేస్తున్న అస్త్రసన్యాసం ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకే బోధపడటం లేదు.