GovtHospitals | సిటీబ్యూరో, ఏప్రిల్13,(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీ విద్య(23) పౌష్టికాహార లోపం కారణంగా మహిళా దినోత్సవం రోజే మరణించింది. ప్రసవ సమయంలో ఆసుపత్రిలో చేరిన మహిళ.. రక్తహీనత కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం మూలంగా చికిత్స పొందుతూ మరణించి, చిన్నారి శిశువును అనాథగా మిగిల్చింది. కేసీఆర్ కిట్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాకుండే అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కావడం అక్కడున్న వారందరినీ కంటతడిపెట్టించింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక నవజత శిశువు మృతిచెందిన ఘటన ఇటీవల వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. అమరచింత మండలానికి చెందిన అనిత పురిటి నొప్పులతో బాధపడుతూ.. అమరచింత ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. అందులో ప్రసవం చేసేందుకు వైద్యులు లేకపోవడంతో, ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిండం వెనక భాగం బయటకు వచ్చిందని అక్కడి వైద్యులు వెనకడుగు వేసి, జిల్లా ఆసుపత్రికి తీసుకుపోండని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయిన కుటుంబీకులు అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో తల్లిని రక్షించే క్రమంలో తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన బిడ్డ తల మొండాన్ని రెండుగా కోసి బయటికి తీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎందరో శ్రీవిద్యలు ప్రాణాలు కోల్పొగా, మరెందరో అనితలు కడుపులోనే బిడ్డలను చంపుకుంటున్నరు. పేదింట్లో పుట్టిన గర్భవతులు, బాలింతలు పోషకాల లోపం కారణంగా రక్తహీనతకు గురవుతున్నారు. కేసీఆర్ పాలనలో ఇచ్చిన న్యూట్రిషన్ కిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
పేద గర్భిణులకు బాసటగా, సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలే లక్ష్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా 2017 జూన్ 2న పేట్ల బుర్జ్ ఆసుపత్రి కేంద్రంగా కేసీఆర్ కిట్ పథకాన్ని స్వయంగా నాటి సీఎం కేసీఆర్ ప్రారంభంచడం విశేషం. ప్రభుత్వ అసుపత్రుల్లో ప్రసవించే వారికి రూ.2000 విలువ చేసే కేసీఆర్ కిట్‌లో 16 రకాల వస్తువులతో పాటు మగపిల్లవాడు జన్మిస్తే రూ.12000, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13000 గత సర్కారు చెల్లించింది.
దీనివల్ల ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేసీఆర్ కిట్ గురించి తెలుసుకున్న ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు సైతం ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవించారు. దీంతో పాటు పుట్టే బిడ్డలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భం దాల్చిన 3 నెలలనుంచి ప్రసవం అయ్యేంత వరకు 2 పర్యాయాలు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో రూ.3 వేలు విలువ చేసే ఆరోగ్య వస్తువులు ఉచితంగా అందించారు. దీనికి తోడు అనేక సంక్షేమ కార్యక్రమాలు సైతం చేపట్టారు.
ఎంసీహెచ్ కిట్ ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలం
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. కేసీఆర్ పేరును ప్రజల గుండెల్లోంచి తొలగించేందుకు తన కుట్రలను బయటపెట్టసాగింది. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండే పథకాల పేరు మార్చడం,లేదంటే రద్దు చేయడం వంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే గర్భిణులు, బాలింతలకు వరమైన కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరు మార్చుతూ అధికారంలోకి రాగానే ఉత్తర్వులు జారీచేసింది. కేసీఆర్ పేరును తీసేసి ఎంసీహెచ్ కిట్‌గా ఖరారు చేసింది.
పేరునైతే మార్చిందికానీ కేసీఆర్ ఆశయాన్ని అందుకోలేకపోయింది. పేరు మార్చిననాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా ఎంసీహెచ్ కిట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఎంసీహెచ్ కిట్లను 2024 ఫిబ్రవరి నుంచి కాంగ్రెస్ సర్కార్ నిలిపేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ప్రసవాల నమోదు క్రమంగా తగ్గుతున్నది.
కేసీఆర్ కిట్ ఉన్నప్పుడు నెలకు 1400 ప్రసవాలు అయిన పేట్లబుర్జ్ ఆసుపత్రిలో ప్రస్తుతం 1000 వరకు మాత్రమే అవుతున్నాయి. రాష్ట్రంలో పేరుగాంచిన నిలోఫర్ లో గతంకంటే ఇప్పుడు 500పైగా ప్రసవాలు తగ్గాయి. ప్రభుత్వ మెటర్నిటీలో 600 నుంచి 700 వరకు ప్రసవాలు తగ్గడం అందోళనను కలిగిస్తున్నది. గతంలో గాంధీ ఆసుపత్రికి నెలలో రిఫరల్ కేసులు, హైరిస్క్ కేసులు 400 వరకు సాధారణ ప్రసవాల కోసం 1300 వరకు వస్తుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.