GHMC | సైదాబాద్, జూన్ 24 : వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే… చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి మొత్తం బిల్లులను కాజేసే కుట్రకు తెరలేపారు. ఐఎస్ సదన్ డివిజన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. నెలరోజుల క్రితం జిహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై సీసీ రోడ్డు వేయకుండానే రూ. 10 లక్షలు స్వాహా చేసిన విషయం మర్చిపోకముందే, మళ్లీ అదే తరహా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య నగర్లో వర్షాకాలంలో తరచూ ఎదురవుతున్న వరదనీటి ఇబ్బందులను నివారించేందుకు గాను ప్రస్తుతం ఉన్న నాలాను బాక్స్ డ్రైన్‌గా నల్ల పోచమ్మ టెంపుల్ నుండి ఎక్సైజ్ కాలనీ వరకు బాక్స్ డ్రైయిన్ ఆధునీకరణకు రూ. 90 లక్షలు కేటాయించి టెండర్లను ఆహ్వానించారు. బాక్స్ డ్రైయిన్ టెండర్లను సైదులు నాయక్ అనే కాంట్రాక్టర్ వాటి పనులను 2021 జూన్‌లో స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొని పనులను ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొద్ది పనులను తూతూ మంత్రంగా మొదలుపెట్టి నాలుగు పైపులు వేసి అలాగే వదిలేశాడు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులను, కాంట్రాక్టర్‌ను అడగ్గా తాను అనారోగ్యంతో ఉన్నానని కోలుకోగానే పనులను ప్రారంభించి పూర్తి చేస్తారని వారికి నచ్చజెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి బాక్స్ డ్రైయిన్ ఆధునీకరణ నిర్మాణ పనులు చేయకుండానే, పనులు చేసినట్లు మేజర్మెంట్(ఎంబి)లో రికార్డులు సృష్టించి బిల్లులు పెట్టి రూ.53,59,330 కాజేసేందుకు ప్రయత్నాలు పెట్టి స్వాహా చేస్తున్నట్లు తెలిసింది.
కార్పొరేటర్ ఫిర్యాదుతో.. అవినీతి వెలుగులోకి..
డిఎస్ నగర్‌లోని పోచమ్మ ఆలయం నుంచి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వరకు వరద నీటి కాలువ బాక్స్ డ్రైన్ ఆధునీకరణ పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేస్తున్నట్లు తెలియడంతో జంగం శ్వేతా రెడ్డి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసింది. డీఎస్ నగర్లో వరద నీటి కాలువ పనులు నిర్మాణానికి 2021 జూన్‌లో రూ. 90 లక్షల నిధులు మంజూరై టెండర్ పక్రియ పూర్తి చేశారు. కానీ జిహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు చేయకుండానే చేసినట్లు అధికారుల తప్పుడు రికార్డులు నమోదు చేశారని ఆరోపించారు. అధికారులు, కాంట్రాక్టర్ కలిసి రూ.53,59,330 లను కాజేసేందుకు పథకం రూపొందించారని ఆరోపించారు. అధికారులు కాంట్రాక్టర్లు కలిసి డివిజన్ పరిధిలో చేస్తున్న అవినీతిపై గ్రేటర్ కమిషనర్‌కు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. డివిజన్ పరిధిలో జరిగిన అన్ని పనులపై సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడ్డ అధికారులను కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం అవినీతికి పాల్పడ్డ అధికారులపై, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా కార్పొరేటర్ జంగం శ్వేత, బిజెపి నాయకులు మధుకర్ రెడ్డి, వీరేంద్రబాబు, అమర్నాథ్ రెడ్డిలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ అధికారులపై కాంట్రాక్టర్ పై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివిజన్లో జరిగిన అన్ని పనులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో కమిషనర్ కర్ణన్ పర్యటించి పనులను పరిశీలించాలని వారు నగర కమిషనర్‌ను కోరారు.