సిటీబ్యూరో : కాంగ్రెస్ సర్కార్ ఇష్టానుసారంగా జలమండలిని విస్తరించి శివారు ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. జీహెచ్ఎంసీతో సమాంతరంగా జలమండలి విస్తరించడంతో శివారులోని మున్సిపాలిటీలు, గ్రామాలు భాగమయ్యాయి. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, సిబ్బందిని కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉండటంతో నీటి బిల్లులు చెల్లించలేదు. కొన్ని ప్రాంతాల్లో చెల్లించినా నామమాత్రంగా బిల్లులు వసూలు చేసేవారు.
గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీల్లోనూ నల్లా బిల్లులు వసూలు చేయలేదు. దీంతో ప్రజలకు నిరంతరం తాగునీరు సరఫరా అవడంతో పాటు బిల్లుల బాధలేకుండా సంతోషంగా జీవించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు చాలినంత సిబ్బంది ఉండటంతో ఎప్పటికప్పుడు నీటిని సరఫరా చేసేశారు. ఏదైనా సమ స్య వస్తే క్షణాల్లో పరిష్కారం లభించేది. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఒక నిర్దిష్ట ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు చేయకుండా జలమండలిని విస్తరించి శివారు ప్రాంతాల్లోని ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నది. జలమండలిని 2021లోనే విస్తరించాలని భావించి అప్పట్లో విడుదల చేసిన జీవోను సాకుగా చూపుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై బిల్లు పోటు పొడుస్తున్నది. జలమండలిలో ఈ ఏడాది విలీనమైన గ్రామాల ప్రజలపై అప్పటి బిల్లులను మోపుతూ వేధింపులకు గురిచేస్తున్నది.
ఒకే కనెక్షన్‌పై రూ.15,793 బకాయి..
కోకాపేటను విస్తరణలో భాగంగా జలమండలిలో విలీనం చేశారు. అంతకుముందు నార్సింగి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి బిల్లులు వసూలు చేయలేదు. కానీ జలమండలిలో విలీనమైన తర్వాత ఏప్రిల్ 2021 నుంచి నల్లా బిల్లులను విధిస్తున్నారు. కోకాపేటలోని ఓ వినియోగదారుడికి నెలవారి బిల్లు రూ.258 చెల్లించాల్సిందిగా వచ్చింది. కానీ దానితోపాటు రూ. 15,793 పెండింగ్‌లో ఉన్నట్లు బిల్లు రసీదులో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులను ప్రశ్నించగా 2021 నుంచి నీటి బిల్లులన్నీ జమ చేసి వేసినట్లుగా సెలవిచ్చారు. జలమండలిలో విలీనమైనప్పటి నుంచి వసూలు చేయాలి కానీ.. 2021 నుంచి వేయటమేంటని అడిగితే జీవో ప్రకారం అలా ఉందని సమాధానమిస్తున్నారు. ఇదే పరిస్థితి కోకాపేటతో పాటు జలమండలిలో విలీనమైన గ్రామాలన్నింటిలో ఉన్నదని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
ఒక్కో కనెక్షన్‌పై వేలాది పెండింగ్‌లు
జలమండలి విలీన మున్సిపాలిటీలు, గ్రామాల ప్రజలపై నల్లా బిల్లుల మోత మోగిస్తున్నది. వేలాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు మెసేజులు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. తాజా బిల్లుతోపాటు 2021 నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు బిల్లులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నారు. జలమండలిలో తమ గ్రామాలు విలీనమైన నెలలు గడవకముందే వేలాది రూపాయల బిల్లులు రావడమేంటని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే నీటి సరఫరా కొనసాగిస్తామని క్షేత్రస్థాయి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని వాపోతున్నారు. మీటర్ల రిపేర్లు ఏర్పడినా, పైపులైన్ల సమస్యలు తలెత్తినా మరమ్మతుల చేయకుండా పెండింగ్ బిల్లులను సాకుగా చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మంచినీటి సరఫరాకు అంతరాయం, లోప్రెషర్, కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో లేని కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నారని వాపోతున్నారు. 2021 జీవోను ఇప్పుడెలా అమలు చేస్తారని జలమండలి అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత జీవోలను పక్కన పెట్టి జలమండలిలో విలీనమైనప్పటి నుంచే బిల్లులు వసూలు చేయాలని కోరుతున్నారు.