సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రియల్ వ్యాపారంతో ధన దాహాన్ని తీర్చుకుంటున్న వాసవి సంస్థపై హైడ్రా దృష్టి సారించిందా? త్వరలోనే వాసవికి హైడ్రా వాత పెట్టనుందా? కూకట్‌పల్లిలోని కాముని, మైసమ్మ చెరువును కబలిస్తూ వాసవి సరోవర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి కాముని, మైసమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాల్లో పర్యటించారు.
వాసవీ నిర్మాణ సంస్థ కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వెళ్లే వరదనీటి కాలువను మళ్లించడంతో దిగువన ఉన్న సప్తార్నగర్, రాజీవ్‌గాంధీనగర్ బస్తీలు వర్షాకాలంలో మునిగిపోయాయని స్థానికుల ఫిర్యాదు మేరకు.. వాసవీ నిర్మాణ సంస్థలో వరదనీటి కాలువ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. వాసవీ సరోవర్ నిర్మాణ సంస్థ నిబంధనల ప్రకారం 17 మీటర్ల వెడల్పుతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
నిబంధనల ప్రకారం వాసవీ నిర్మాణ సంస్థ ముందుగా వరదనీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని, ఆ కాలువ పనులు చేయకుండానే నిర్మాణ పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాసవి సరోవర్‌పై హైడ్రా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందోనన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాముని, మైసమ్మ చెరువులు బడా నిర్మాణ సంస్థలో చేతిలో పడి కనిపించకుండా పోతున్నాయని స్ధానికులు ఫిర్యాదు చేయడం, మైసమ్మ చెరువు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
కూకట్పల్లి మండలంలోని మైసమ్మ చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం… ప్రైవేట్, ప్రభుత్వ భూములను కలుపుకుని 227 ఎకరాలుండగా.. ప్రస్తుతం 83 ఎకరాలు మాత్రమే కనిపిస్తుంది. కూకట్పల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ సర్వే నం.893లో 84.2 ఎకరాల శిఖం భూమి ఉండగా, ఎఫ్టీఎల్ పరిధిలో మిగిలిన పట్టా భూములు 906, 907, 905, 903, 902, 901, 904, 900, 899, 898, 896, 892ఏ, 892ఏఏ, 894, 895. మూసాపేట గ్రామం పరిధిలో 71,72, 70, 63, 64,65, 66, 59, 58, 57,56, 50,49,48,47, 46ఏ,బీ, సీ,డీలు, 45,44, 43,42, 40,41, 92, 93,94, 95, 96, 97,98, 104,105,,107,108, 103, అల్లాపూర్ పరిధిలో 50, 51,52 సర్వే నంబర్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నాయి. సర్వే నం. 49,50,51, 52, 54,56, 57,64, 66, 69, 73,74, 99, 102, 103, 104, 892 బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇందులో ఎఫ్టీఎల్లో 182.10 ఎకరాలు బఫర్ జోన్లో 45.12 ఎకరాలున్నట్లు రికార్డుల్లో నమోదైంది.
వాసవి నిర్మాణ సంస్థ 2023లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని 11 బ్లాక్‌లుగా 29 అంతస్తులలో నిర్మాణ పనులను ప్రారంభించింది. వాసవి నిర్మాణ సంస్థ అనుమతులు పొందిన సర్వే నంబర్లు.. 50, 51, 52,70,66,57, 56,50, 49లలోని 10.59 ఎకరాల భూమి ఎఫ్టీఎల్ పరిధిలోకి రాగా… సర్వే నం.49,52, 54,56, 56,57,99 లలోని 16.51 ఎకరాల స్థలం బఫర్ జోన్ పరిధిలో ఉంది. కాగా, వాసవి నిర్మాణ సంస్థ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో 27.1 ఎకరాలు కూడా ఉంది. ఈ స్థలంలో 2.30 ఎకరాల బఫర్ జోన్‌ను వదిలామని నిర్మాణ సంస్థ చెబుతున్నది. కానీ… మిగిలిన స్థలంలో కూడా బఫర్‌జోన్ ఉందని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమతులు పొందిన స్థలానికి చెందిన సర్వే నంబర్లు ఇప్పటికి వ్యవసాయ భూమిగానే ధరణీ పోర్టల్‌లో కనిపిస్తుందని, నాలా కన్వర్షన్ చేయకున్నా… ఆ నిర్మాణ సంస్థ అడ్డదారిలో అనుమతులు తీసుకువచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
కూకట్పల్లి మండలంలో గొలుసుకట్టు చెరువులుగా ముళ్లకత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులు కనిపిస్తాయి. ఒక చెరువు నుంచి వచ్చే వరదనీరు కింది చెరువుకు వెళ్లేలా సహజసిద్ధ కాలువలు ఉన్నాయి. ఇలా కాముని చెరువు అలుగు నుంచి వెళ్లే వరదనీరు మైసమ్మ చెరువుకు చేరుకుంటుంది. సహజంగా వెళ్లే ఈ వరదనీటి కాలువను వాసవి నిర్మాణ సంస్థ మళ్లించేందుకు అనుమతులు పొందింది. 17 మీటర్ల వెడల్పుతో 2.8 మీటర్ల లోతుతో కృత్రిమంగా వరదనీటి కాలువను నిర్మించడానికి అనుమతి తీసుకున్నారు. సహజంగా వెళ్లే వరదనీటిని జడ్ ఆకారంలో ఆర్సీసీ గోడలను నిర్మించి కృత్రిమంగా నాలాను ఏర్పాటు చేయనున్నారు. సహజంగా వెళ్లే వరదనీటిని మళ్లించి కృత్రిమంగా తయారు చేసిన కాలువలో వరదనీటిని పంపించడం వల్ల సమీపంలోని కాలనీలు, బస్తీలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మైసమ్మ చెరువులో సుందరీకణ పనులను వాసవీ నిర్మాణ సంస్థకు.. సీఎస్ఆర్లో భాగంగా జీహెచ్ఎంసీ అప్పగించిందని, ఈ ముసుగులో సదరు సంస్థ కబ్జాకు పాల్పడుతుందని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వివరించారు. నాలా ప్రస్తుతం ఆరు నుంచి 7 మీటర్లు ( ఆరు ఫీట్ల నుంచి 22 ఫీట్లు) వెడల్పు మాత్రమే ఉందని ఈ సుందరీకణ పనులతో స్థానికంగా ఉన్నటువంటి రాజీవ్‌గాంధీనగర్, సప్తార్నగర్ కాలనీలు వరదనీటిలో మునిగిపోతాయని ఆ కాలనీలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.