సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ ): ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు ఆలర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఏదైనా రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లి తింటున్నారా? పేరొందిన రెస్టారెంట్‌కు వెళ్లి డిమ్ లైటింగ్‌లో కూర్చొని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త.. మీరు తీసుకునే ఆహారం విషం లాంటిదే అని నమ్మక తప్పదు.. మీరు లొట్టలేసుకుంటూ లాగించే ఆహార పదార్థాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్మక తప్పదు. గ్రేటర్లో చాలా మందిలో తమ ఇంటికి ప్రెండ్స్ కానీ.., బంధువులు కానీ వచ్చినప్పుడు రొటీన్‌కు భిన్నంగా ఫేమస్ రెస్టారెంట్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైనా సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకం. అయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది.
బండారం బట్టబయలు
రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్‌ఫైరీ డేట్ దాటిన ప్రొడక్ట్, కల్తీ మసాలాలు, ఏ మాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులు ఒకటో, రెండో రెస్టారెంట్లలో కాదండోయ్.. గ్రేటర్లో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో ఇదే సీన్ కనిపించడం ఆందోళనకరం.
ఫుడ్ సేఫ్టీ దాడుల్లో విస్తుపోయే నిజాలు
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు వరకు నిర్వాహకులు నాణ్యమైన వాటిని వినియోగించి క్వాలిటీ ఫుడ్‌ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంటగదులు పరిభ్రదత పాటించడం లేదు.
బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు
ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మాసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. తరచుగా జీహెచ్ఎంసీకి నిత్యం 10పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు కల్తీరాయుళ్ల భరతం పట్టాలని నిర్ణయించింది.
ఫంగస్ ఉన్న పదార్థాలు, బొద్దింకలు
లక్డీకాపూల్‌లోని ఆశోక హోటల్, ఫిష్ ల్యాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. చికెన్ లెగ్ బోన్ లెస్ (5 కిలోలు), లిక్విడ్ కారామెల్ కలర్, గ్రీన్ పప్పు (10 కిలోలు) వంటి ఆహార పదార్థాలు పాడైనట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబులింగ్ నిబంధనలను పాటించకుండా ఉన్న జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రమాంసం నిల్వ చేసే ప్రాంతంలో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేయబడిన పదార్థాల్లో ఫంగస్ ఉన్నట్లు తేల్చారు. లక్డీకాపూల్ ఫిష్ ల్యాండ్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. కిచెన్ ప్రాంగణంలో ఎలుకల బెడత ఉన్నట్లు గుర్తించారు. వంటగదిలో దొరికిన సింథటిక్ ఫుడ్ కలర్లను అక్కడే వదిలేశారు. డస్ట్బిన్లకు మూతలు లేవని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు 040- 2111 1111లో సంప్రదించాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారి బాలాజీ కోరారు.
ఫుడ్‌సేఫ్టీ దాడుల్లో పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు
ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు నెలలుగా నిబంధనలకు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్లపై చర్యలు తీసుకున్నారు. దాదాపు 75కు పైగా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటే అత్యధికంగా పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు ఉండడం ఆందోళన కలిగించే అంశం. రెండు రోజుల క్రితం లక్డీకాపూల్‌లోని ఆశోక హోటల్, ఫిష్ ల్యాండ్ హోటల్లో ఫుడ్‌సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.