దుండిగల్, జూలై 14: బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి, అప్పుల పాలైన ఓ బీటెక్ విద్యార్థి అవి తీర్చే మార్గం లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, కాటారం మండల కేంద్రానికి చెందిన రైతు తోటపల్లి తిరుపతి కొడుకు రమాకాంత్ (20), నగర శివారు మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ (డేటా సైన్స్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
పక్కనే ఉన్న బహదూర్ పల్లి లోని ఇందిరమ్మ ఇండ్లలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నా డు. అయితే రమాకాంత్ బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటిని తీర్చేందుకు స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో తాను బెట్టింగ్ యాప్‌ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోవడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో నెల క్రితం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తికి రూ.34 వేలు చెల్లించారు. అయితే తనకు మూడు నెలల మిత్తి డబ్బులు రావాలని జ్ఞానేశ్వర్ రమాకాంత్‌పై ఒత్తిడి పెంచుతుండగా, మరో స్నేహితుడికి రూ.10 వేలు ఇవ్వాల్సి ఉండడంతో రమాకాంత్ సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు.
అంతటితో ఆగకుండా ల్యాప్‌టాప్ కూడా తీసుకెళ్తానని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన రమాకాంత్ సోమవారం ఉదయం ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి డబ్బులు కావాలని అడిగాడు. తన వద్ద అన్ని డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో రమాకాంత్ తాను నివాసం ఉంటున్న గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.