సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచనలతోనే పనులు చేపట్టే స్థాయికి హెచ్ఎండీఏను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. సమగ్ర విధివిధానాలపై స్వయంగా పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండానే.. వడ్డించిన విస్తరి తరహా పని విధానాన్ని హెచ్ఎండీఏ పరిధిలో ప్రవేశపెట్టింది. ఇలా కీలకమైన ప్రాజెక్టుల విషయంలో టీఏలు, ఏజెన్సీల నియామకం పేరిట ఇప్పటి వరకు రూ. 10కోట్లు ఖర్చు చేసినప్పటికీ పది పనులు కూడా చేసిన దాఖలాలు లేదు.
హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహారించే హెచ్ఎండీఏకు ట్రాన్స్క్షనల్ అడ్వైజరీ(టీఏ) ద్వారా పనిలో మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు నగరానికి తలమానికమైన ఎన్నో ప్రాజెక్టులను ఎలాంటి టీఏలు లేకుండా నిర్మించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాలను సొంతంగా అధ్యయనం చేసే హెచ్ఎండీఏ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అసలు ఏం నివేదిస్తాయనేది ఇప్పుడు సంబంధిత విభాగాధిపతులను కూడా గందరగోళానికి గురి చేస్తుంది. హెచ్ఎండీఏ మూడు ప్రాజెక్టుల కోసం టీఏల నియామకానికి చేపట్టగా.. ఇందులో ఎలివేటెడ్ కారిడార్, మీరాలం కేబుల్ బ్రిడ్జి పనులను అధ్యయనం చేసే బాధ్యతలను ఆయా ఏజెన్సీలు తీసుకున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేసిందనేది ఇప్పటికీ అంతు చిక్కని అంశమే. ఇక వీటితో పాటు నగరంలో మరో మూడు స్కై వాక్ వేల నిర్మాణానికి కూడా ఇదే తరహాలో ఏజెన్సీలను నియమించే పనిలో పడింది. ఆ ఏజెన్సీలు ఇచ్చే సలహాలు, డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుని, నిర్మాణానికి మరోసారి టెండర్లను ఆహ్వానించనుంది.
ట్యాంక్ బండ్ సుందరీకరణ, వ్యూహాత్మక ప్రాజెక్టు లక్ష్యంగా హెచ్ఎండీఏ మార్చి నెలలో మాస్టర్ ప్లాన్, డిజైన్, డిటైల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కోసం టెండర్లను గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బీపీపీని రీ డెవలప్ చేయడానికి ఏజెన్సీలను ఆహ్వానించి టెండర్లు కట్టబెట్టింది. అయితే ఏడాది గడిచినా ఈ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిపాదనల పేరిట హడావుడి చేస్తూ.. ప్రణాళికలను పట్టాలెక్కించడంలో జాప్యం చేస్తోంది. దీంతో నగరం పర్యాటకంగా, అభివృద్ధిలో వెనకబడిపోయింది. ట్యాంక్ బండ్ పరిసరాలను రీక్రియేషనల్ జోన్‌తోపాటు, మొబిలిటీ కారిడార్, ల్యాండ్ యూజ్ రీ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ డిజైన్లు వంటి కీలకమైన అంశాలతో రూపొందించే బాధ్యతను ఏజెన్సీకి అప్పగించి, పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రాజెక్టు మొదలు కాక ముందే, ప్రతిపాదనలు మూలన పడేలా చేశారు. ప్రాజెక్టు వలన పర్యాటక అభివృద్ధి జరుగుతుందని తెలిసినా ప్రతిపాదనలు కార్యరూపంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదు.
ఇక నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భారీ స్కై వాక్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు, అధ్యయనం కోసం ఇటీవలే హెచ్ఎండీఏ ఓ ఏజెన్సీకి అప్పగించింది.అదే తరహాలో మరో జేఎన్టీయూ వద్ద నిర్మించాల్సి ఉన్న స్కై వాక్ వే కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించింది. అదే విధంగా నగరంలో లక్డీకాపూల్ పెట్రోల్ బంక్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్ వేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కేవలం ఉప్పల్ వాక్ వే మినహా ఏ ఒక్కటి అందుబాటులోకి రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియమించారు. కానీ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో చెప్పలేని స్థితిలో ఆ ప్రాజెక్టులు ఉన్నాయి.
పౌరులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించాల్సిన అంశంలో ఆదాయ మార్గాలు, నిర్మాణ వ్యయం వంటి అంశాలపై ఎలాంటి అధ్యయనం చేయాల్సిన పనిలేదని నిబంధనలే చెబుతున్నాయి. కానీ వాటిపై అధ్యయనం చేయడానికి ట్రాన్సక్షనల్ అడ్వైజరీలు, ఏజెన్సీలను నియమించుకోవడం ఇప్పుడు హెచ్ఎండీఏలో సర్వసాధారణమైంది. ఇప్పటివరకు ఈ ఏజెన్సీల పేరిట రూ. 10కోట్లకు పైగా ఖర్చు చేయగా.. ఆర్థికపరమైన, ఇతర అంశాల్లో సాధ్యాసాధ్యాలను ఏమేరకు అంచనా వేస్తాయనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. నిర్మాణానికి ప్రధానమైన ఆర్థిక వనరులు, వినియోగం, నిర్వహణ భారం వంటి రెవెన్యూ పరమైన అంశాలపై అంచనా వేస్తూ టీఏలూ సలహాలిస్తారని చెబుతున్నా… హెచ్ఎండీఏకు ఆర్థిక భారమే తప్ప.. ఆదాయం మిగిలే అవకాశం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆదేశాలతో ఏజెన్సీల నియామకం చేయాల్సి వస్తుందనే హెచ్ఎండీఏ వర్గాలే వాపోతున్నాయి. ఇలా ఎలివేటెడ్ కారిడార్ నుంచి మొదలుకుని, స్కై వాక్ వేల వరకు ఏజెన్సీలకు ప్రాజెక్టులను కట్టబెట్టి, కాగితాల్లోనే మురిసిపోయేలా చేస్తున్నారు.