కేపీహెచ్‌బీ కాలనీ: ‘కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములను కొనుగోలు చేస్తున్నారా…తస్మాత్ జాగ్రత్త.. ఆయా ప్రాంతాల్లోని కొన్ని ప్లాట్లు రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్రమాదం ఉంది. స్థలాల వేలం పాట పేరుతో హౌసింగ్‌బోర్డు ప్రజలను మోసం చేస్తున్నది.. అని కూకట్పల్లి మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. హౌసింగ్‌బోర్డు అధికారలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలను, మాస్టర్ ప్లాన్లను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గు చేటన్నారు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ప్రకారం…
కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేస్ నుంచి గోపాల్‌నగర్ వైపు 200 ఫీట్ల రోడ్డుగా నిర్ణయించిందని, రోడ్డు పక్కన ఉన్న 146 గజాలు, 78 గజాల విస్తీర్ణం గల రెండు ప్లాట్లను 80 ఫీట్ల రోడ్డుగా చూపుతూ అమ్మకానికి పెట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఆ రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కొద్దిరోజుల్లోనే ఆ ప్లాట్లను రోడ్డు విస్తరణలో కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులు మాత్రం రోడ్డులో ప్లాట్లు పోతే… జీహెచ్ఎంసీ నుంచి నష్టపరిహారం కింద టీడీఆర్ ఇస్తారని చెబుతున్నారన్నారు. అలా చూసినా.. ప్లాట్‌ను కొన్న ధరకు…టీడీఆర్ ధరకు పోల్చితే పావు వంతు కూడా ధర రాదన్నారు. ఇలా ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా హౌసింగ్ బోర్డు వేలం పాటను వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.