ఉస్మానియా యూనివర్సిటీ: సీఎం రేవంత్రెడ్డి ఓయూ వేదికగా సోమవారం ఇచ్చిన మాటపై నిలబడే దమ్ముందా అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ అధికారుల మాటలను నమ్మి మోసపోయారని చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అధికారుల మాటల నమ్మకుండా విద్యార్థి నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు విద్యార్థుల మెస్ బకాయిలను చెల్లించలేకపోవడంతో వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి వివిధ ఉద్యోగాల వచ్చినా ఆర్థిక పరిస్థితుల వలన మెస్ బకాయిలు చెల్లించలేక ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చిందని వాపోయారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మెస్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో ప్రవేశం పొందిన ప్రతి పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కౌశిక్, మహేశ్, రమేశ్, నిఖిల్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.