హిమాయత్‌నగర్,అక్టోబర్13: రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపు నిచ్చారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తరతరాలుగా అణిచివేత,వివక్షతకు గురౌవుతున్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఈ నెల 15న జరిగే రాస్తారోకోలు,నిరసన కార్యక్రమాల్లో బీసీలు అధిక సంఖ్యల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నేతలు తాటి వెంకటేశ్వరరావు,ఆర్.పాండు రంగాచారి, డి.జె.సాయిల్‌గౌడ్, నరసయ్య పాల్గొన్నారు.