మేడ్చల్, ఫిబ్రవరి 5 : కుల గణన సరిగా జరగలేదు. వందకు వంద శాతం ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పు. సమగ్రంగా జరిగి ఉంటే బీసీలకు జనాభా తగ్గేది కాదు అని బీసీ నేతలు బీసీ గణనపై మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం అసెంబ్లీలో చెప్పిన బీసీ లెక్కలు ముమ్మాటికీ తప్పులతడకగా జరిగిందని, ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో ప్రజలను సంప్రదించకుండానే నివేదికలు తయారు చేశారని స్పష్టం అవుతుందన్నారు. ప్రభుత్వానికి సమగ్ర కుల గణనపై చిత్తశుద్ధి చూపలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ సర్వే, గణాంకాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీ గణనపై కేంద్రం కుంటి సాకులు చెబుతూ బీసీలకు అన్యాయం చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు దశరథ్ అన్నారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం బీసీ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరగాలంటే జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న గణన జరగాలన్నారు. కులాల వారీగా జన గణన చేసి, జనాభా ప్రకారం విద్యా, ఉపాధి రంగాల్లో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాని, ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించే బిల్లు పెట్టాలని, రూ.2 లక్షల కోట్లను బీసీలకు అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. నాయకులు కాసర్ల నాగరాజు, నరేంద్ర చారి, లక్ష్మి, కృష్ణ, రాజేశ్వరి, సాయిలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ,ఫిబ్రవరి 5:గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం బలంగా ఉందని, అం దుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన జరిగినప్పుడే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రారంభమైన ఇంటింటి సమగ్ర కులగణన సర్వే మాదిరిగా కేంద్రం దేశ వ్యాప్తంగా చేపట్టాలని, బీజేపీ మంత్రులు, ఎంపీలు కులగణనపై ప్రధానిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీలు ఓటర్లుగా కాకుండా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం వచ్చినప్పడే బీసీల బతుకులు మారుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీసీదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన బీసీల కోసం కాదని, సీఎం రేవంత్‌రెడ్డి తన సీఎం పీఠాన్ని కాపాడుకోవడానికి చేసిన సర్వే అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులగణనపై జరిగిన ‘పరిణామాలు-సీఎం తప్పుడు లెక్కలు-భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై బుధవారం నగరంలోని ఓ హోటల్లో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..ఈ సర్వేను బీసీలు తిరస్కరిస్తున్నారని, ఫేక్ సర్వే అని అన్నారు. తప్పుల తడకగా సర్వే జరిగిందన్నారు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన హెచ్చరించారు. తప్పుల తడకగా చేసిన సర్వే తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో వంద తప్పులకు ప్రభుత్వం పాల్పడుతుందని వివరించారు. బీసీ కులగణనపై తీర్మానం చేసినట్లుగా అసెంబ్లీలో సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ప్రణాళికతో వారి ఆటకట్టిస్తామని హెచ్చరించారు. దామోదర్ రాజనర్సింహను చూసీ బీసీ మంత్రులు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి చుట్టూ భజన చేయకుండా బీసీ నాయకులారా బీసీ కులగణనపై గళమెత్తాలని కోరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పాల్గొన్నారు.
సమగ్ర కుల గణన సర్వే జరిగా జరుగలేదు. సర్వే నిర్వాహకులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించలేదు. కూర్చొన్న చోటనే లెక్కలు రాసుకున్నారు. ఎంతో మంది మా ఇంటికి రాలేదంటే.. మా ఇంటికి రాలేదని చెప్పారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పూర్తి స్థాయిలో సర్వే జరుగలేదు. మా ఒక్క గ్రామంలోనే ఇలా ఉంటే మండలం, జిల్లా, రాష్ట్రంలోనే పరిస్థితి ఏంటి. బీసీల్లో ముదిరాజ్‌లు, గౌడ్లు, మున్నూరు కాపు, కమ్మరి, కుమ్మరి తదితర కులాల వారు అధిక సంఖ్యలో ఉన్నారు. 46 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పడం బీసీలను మోసం చేయడమే. తమ కులం పరంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మండల, గ్రామస్థాయిలో తాము మున్నూరుకాపు సంఘట తరుపున సర్వే నిర్వహించాం. మున్నూరు కాపులకంటే ముదిరాజ్‌లు, గౌడ్లు అధికంగా ఉన్నారు. అన్ని బీసీ కులాల కలుపుకుంటే 50 శాతానికి మించి ఉంటారు. అంతేగానీ 46 శాతానికి పడిపోయినట్టు సమగ్ర కుల గణన సర్వేలో చూపడం దారుణం. బీసీలు పెండ్లీలు కావడం లేదా? పిల్లలు పుట్టడం లేదా? జనాభా పెరగాలని గానీ తగ్గుతుందా? ఈ నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
కామారెడ్డి డిక్లేరేషన్ ప్రకారం బీసీ 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదరాబాదరాగా సమగ్ర కుల గణన నివేదికను ప్రకటించారు. గతంలో 1.86 కోట్లతో 51 శాతం ఉన్న బీసీలు 1.64 కోట్లతో 46 శాతానికి ఎలా తగ్గుతారు. కేసీఆర్ సారధ్యంలో ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినా శాస్త్రీయ పద్ధతిలో అన్ని ఇండ్లకు వెళ్లి సర్వే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వే నిర్వహణలో స్పష్టత లేదు. నిర్లక్ష్యం కూడా కన్పించింది. మేడ్చల్‌లో జాతీయ రహదారి పొడువునా సర్వే ఫారాలు కన్పించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ పరంగా రిజర్వేషన్‌ను కల్పిస్తాం. బీసీల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపి, వారిని వంచించింది. బీసీ జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల చేతిలో ఘోరపరాభవం తప్పదు.
మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ జనాభా లెక్కలు తప్పుల తడుకగా ఉన్నాయి. బీసీ జనాభాను తక్కువ సంఖ్యలో చూపించి ప్రజాస్వామ్యంగా రావాల్సిన వాటాను, రిజర్వేషన్లలో కాంగ్రెస్ మోసం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి రిజర్వేషన్‌ను వెంటనే నిలిపివేసి, వెంటనే కొత్తగా సర్వేను చేపట్టాలి. సర్వే చేయని పక్షంలో పెద్ద ఎత్తును నిరసనలు చేపడుతాము.