R Krishnaiah | ముషీరాబాద్, ఫిబ్రవరి 15 : రాష్ర్టంలో తప్పులతడకగా సాగిన బీసీ జనగణన సమస్యను పక్కదారి పట్టించేదుకే ప్రధాని కులాన్ని సీఎం రేవంత్రెడ్డి తెరపైకి తెస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదనీ, కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. బీసీల సమస్యలను పక్కదారి పట్టించేదుకు సీఎం కొత్త ఎత్తుగడ వేశారని, మోడీ బీసీ కాదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలు దేశంలోని బీసీలను కించపర్చడం, అవమానపర్చడం వంటిదని, సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రధానిగా గొప్పగా రాణిస్తుంటే అగ్రవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. అత్యున్నతమైన ప్రధాని పదవి బీసీ నేత చేపడితే ఓర్వలేకపోతున్నారని, వాస్తవానికి మోదీ గాండ్ల కులము చెందినవారని తెలిపారు.
దేశంలో బీసీలకు రక్షణ కల్పించడానికి జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ పద్దతి కల్పించారని, విస్తృత అధికారాలు ఇచ్చారని అన్నారు. రాష్ర్టంలో బీసీలు తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నారని, బీసీ జనగణన అసంభద్దంగా చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. బీసీలపై చిత్త శుద్ది ఉంటే వెంటనే రీసర్వే చేయించాలని డిమాండ్ చేశారు. రీసర్వే చేయకుండా ఆన్లైన్లో చెప్పాలనడం శోచనీయమని, ఇంటింటికి తిరిగి సర్వే చేయాలని కోరారు. ప్రభుత్వ పట్టిన 80 ప్రశ్నలు కాకుండా 3 ప్రశ్నలు పెట్టి ఇంటింటి సర్వే చేయించాలని విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రం మీదకు తొసి ఊరుకుంటామంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు కొండా దేవయ్య తదితరులు పాల్గొన్నారు.