ఖైరతాబాద్, అక్టోబర్ 17: బీసీలకు రిజర్వేషన్లు భిక్షకాదని, ఆత్మగౌరవ సమస్య అని తెలంగాణ మున్నూరుకాపు సంఘం పటేల్ అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సాధికారత సమితి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, పాలకులు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప రాజ్యాధికారం ఇవ్వడం లేదన్నారు.
రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉంటే ఇస్తామన్న 42 శాతం కూడా దక్కకుండా చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ఒక సామాజికవర్గం హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు వేస్తే అదే వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నేడు నిర్వహించే బంద్‌లో బీసీలోని 136 కులాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మున్నూరుకాపులు బీసీలు కాదంటూ రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డాక్టర్ కొండా దేవయ్య ఖండించారు.
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవిస్తున్న మున్నూరుకాపులు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో బీసీలుగా పరిగణింపబడుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాలు, మీడియా సమావేశంలో మున్నూరుకాపులు ఓసీలంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మాధవ రెడ్డి మున్నూరుకాపుల చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. 18న జరిగే బంద్ ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా మున్ముందు చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో మున్నూరుకాపు సంఘం పటేల్ నగర అధ్యక్షుడు ఆర్వీ మహేందర్, గురురాజు, తోట శ్రవణ్, నిరంజన్ పటేల్, అంజలి యాదవ్ పాల్గొన్నారు.