Amberpet | అంబర్‌పేట, మే 17 : బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని బతుకమ్మ కుంట – తిలక్‌నగర్ చౌరస్తాకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా తయారైంది. రాత్రిపూట వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. అయినా ఈ రోడ్డును బాగుచేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బతుకమ్మకుంట నుంచి తిలక్‌నగర్ చౌరస్తాకు వెళ్లే దారిలో కొన్ని నెలల క్రితం కొత్త డ్రైనేజీ పైప్‌లైన్ ను ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన తర్వాత వాటర్‌వర్క్స్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ తూతూమంత్రంగా ప్యాచ్‌వర్క్ చేసి చేతులు దులుపుకున్నారు. కొద్ది రోజులు గడిచింది. ఇటీవల హైడ్రా ద్వారా బతుకమ్మకుంట డెవలప్మెంట్ పనులు మొదలయ్యాయి. కుంటలో ఉన్న మట్టిని తవ్వి పెద్ద పెద్ద లారీల ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఆ లారీలన్నీ ఈ రోడ్డు మీద నుంచే వెళ్తున్నాయి. అవి భారీ బరువు ఉండడంతో వాటర్‌వర్క్స్ అధికారులు చేసిన రోడ్డు ప్యాచ్‌వర్క్ పూర్తిగా తొలగిపోయి గుంతలుగా మారింది. పైప్‌లైన్ వేసిన చోట కిందకు కుంగిపోయింది. దీంతో గత పదిహేను రోజులుగా ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఒక్కోసారి వాహనాలు ఎదురెదురుగా వచ్చే సమయంలో స్లిప్ అయి కిందపడిపోతున్నాయి. వాహనదారులకు దెబ్బలు తగులుతున్నాయి. ఇదిలా ఉండగా భారీ వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డుకు సరైన ప్యాచ్‌వర్క్ చేసి వాహనదారులు బాధలు తొలగించాలని కోరుతున్నారు.