కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే బతుకమ్మ (పూల పండుగ) నేడు ప్రపంచ వ్యాప్తమైంది. రాష్ట్రంలో అశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ప్రారంభమై.. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. కానీ.. కూకట్పల్లి గ్రామంలో మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అమావాస్యకు ముందు రోజునే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అమావాస్య రోజున పసుపు కుంకుమ బయటికి వెళ్లొద్దని.. అమావాస్య రోజున బతుకమ్మ పండుగను మొదలు పెట్టొద్దని పెద్దలు చెప్పిన ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు.
ఆడపిల్ల పెరిగేకొద్ది బతుకమ్మ ఎత్తు కూడా పెంచుతారు..
ఇక్కడ ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా.. ఆ పిల్ల పెరిగేకొద్ది బతుకమ్మ ఎత్తును కూడా పెంచుతారు. పెండ్లి చేసే వరకు ప్రతియేటా ఆడబిడ్డతో పాటు బతుకమ్మను ఎత్తుగా పేర్చడం ఇక్కడి ఆనవాయితీ. ప్రతియేటా బతుకమ్మను ఎత్తుగా పేర్చితే ఆ కుటుంబంలో ఆర్థిక నష్టాలు లేకుండా అభివృద్ధి చెందుతుందని ఇక్కడివారి నమ్మకం. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన బతుకమ్మలను పేర్చడం, పోటీపడి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను చెరువులలో నిమజ్జనం చేయడం కూకట్‌పల్లిలోనే కనిపిస్తుంది. అలాగే సద్దుల బతుకమ్మ పండుగ రోజు 5 రకాల నైవేద్యాలను సమర్పించడం.. బతుకమ్మ పేర్చేటప్పుడే బతుకమ్మ లోపల 5 రకాల పండ్లను వేయడం.. చెరువుల్లో నిమజ్జనం చేసేటప్పుడు తల్లి గౌరమ్మను ఇంటికి తేవడం.. పిల్ల గౌరమ్మను చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది.
వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
కూకట్‌పల్లిలో రేపటి (శనివారం) నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు ఎంగిలిపూలు, 21న ఆదివారం పెద్దల అమావాస్య, 27న శనివారం రోజున అట్ల బతుకమ్మ, 28న ఆదివారం బతుకమ్మ అలిగిపోవడం (బతుకమ్మ ఉండదు), 29న సోమవారం పెద్ద బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) వేడుకలు, అక్టోబర్ 2న గురువారం విజయదశమి వేడుకలు ఉంటాయి. రంగధాముని చెరువులో నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ సహకారంతో బతుకమ్మ పండుగ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశాం. కూకట్‌పల్లివాసులు వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
– కంచనపల్లి నాగరాజు, బతుకమ్మ, విజయదశమి ఉత్సవాల కమిటీ కోఆర్డినేటర్,