సిటీబ్యూరో, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ) : గిన్నీస్‌బుక్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు 10వేలకు పైగా మంది మహిళలతో బతుకమ్మ వేడుకను తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిర్వహించాలని యూసీడీ విభాగం ఏర్పాట్లు చేస్తున్నది.
మహిళా గ్రూపులు, ప్రభుత్వ విభాగాల్లోని మహిళా ఉద్యోగులతో యూసీడీ విభాగం సంప్రదింపులు జరుపుతున్నారు. 51 అడుగుల ఎత్తులో అత్యంత పొడవైన బతుకమ్మను పేర్చి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుపనున్నారు. కాగా ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో జరుపుకునే సామూహిక ఓనం పండుగ మాత్రమే ఈ రికార్డును సృష్టించగా…ఈ సారి ఆ రికార్డును బద్దలు కొట్టి మన బతుకమ్మ ఉత్సవాలు ఉండేలా ప్లాన్ చేశారు.