తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 8: మహిళల ఐక్యతకు చిరునామా బతుకమ్మ పండుగ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం, సాంస్కృతిక, పర్యాటక శాఖల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను శుక్రవారం గవర్నర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. తెలుగువర్సిటీ ఆవరణలో బతుకమ్మను కొలుస్తూ ఆట పాటలతో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థిణిలతో కలిసి ఉత్సాహంగా నిర్వహించారు. బతుకమ్మ సంబురాల్లో రా్రష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్సలర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పూర్వీకుల భాష, అలవాట్లను పరిరక్షించుకుని భావితరాలకు అందించాలని సూచించారు.
తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను ఒక్కో రూపంలో నిర్వహించడం తెలంగాణకే గర్వకారణమంటూ.. బతుకమ్మను పెద్ద పండుగగా అభివర్ణించారు. బతుకమ్మ పాటలపై లోతైన పరిశోధనలు జరగాలని వర్సిటీ పరిశోధకులకు సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక పండుగలన్నారు. బతుకమ్మ పాటల్లోని తెలుగు పదాలపై పరిశోధన జరిగినప్పుడే భాష పరిపుష్టిని సాధిస్తుందని సూచించారు. తెలంగాణ భాష, పదాలపై ప్రత్యేక అధ్యయనం జరగాలని కోరారు.
బతుకమ్మను గవర్నర్ ఎంతో గౌరవిస్తూ రాజ్‌భవన్‌లో నిత్యం వేడుకలు జరుపుతున్నారని, ఇది తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగేగ కిషన్‌రావు మాట్లాడుతూ.. తెలుగు భాషా, సాహిత్యం, కళల పరిరక్షణకు నెలకొల్పిన వర్సిటీ 36 ఏండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నదని వివరించారు. వర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.
వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాచుపల్లిలోని కేంద్రానికి వర్సిటీ తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ వారసత్వానికి ప్రతీక బతుకమ్మగా రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ పేర్కొన్నారు. గవర్నర్ దంపతులతో పాటు వర్సిటీ విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పర్యవేక్షించారు. బతుకమ్మ పాటలను పలువురు కళాకారులు, పరిశోధక విద్యార్థిణిలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.