సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్‌కు పండగపూట కూడా పస్తులు తప్పలేదు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సేవా దృక్పథంతో అతి తక్కువ వేతనాలకే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తాము కూడా జీతాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లు వాపోతున్నారు.
మురికి వాడలు, బస్తీల్లో జనాల మధ్య ఉంటూ నిత్యం నిరుపేదల ఆరోగ్యం కోసం శ్రమించే తమకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. కనీసం దసరా పండుగకైనా జీతాలు వేస్తారని వెయ్యి కళ్లతో ఎదురు చూశామని..కానీ అటు అధికారుల్లో, ఇటు పాలకుల్లో చలనం లేదని పండగ పూట తమ భార్యాపిల్లలకు పస్తులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకు డాక్టర్ చదువు చదివాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని నెలల తరబడి జీతాలు అందక సకాలంలో కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని బస్తీ దవాఖాన వైద్యులు వాపోతున్నారు. ఇక కిందిస్థాయిలో పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని, దీంతో ఇంటి యజమానులు ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నామని అంటున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక కొన్ని కొన్ని సార్లు పిల్లలకు అన్నం కూడా పెట్టలేని దుస్థితి నెలకొంటోందని బోరుమంటున్నారు.
వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైవేటు దవాఖానలు సైతం మూతపడిన విపత్కర పరిస్థితుల్లో ఈ బస్తీ దవాఖానలే నిరుపేదలకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మురికివాడలు, మారుమూల బస్తీలు, కాలనీలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో ప్రతినిత్యం నిరుపేద రోగులకు సేవలు అందిస్తున్న సిబ్బంది జీవితాలు జీతాలు లేక దుర్భరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 500బస్తీ దవాఖానలు ఉన్నాయి. అందులో గ్రేటర్ పరిధిలోనే 410 బస్తీ దవాఖానలు ఉండగా మిగిలిన 90బస్తీ దవాఖానలు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. వీటి మొత్తంలో 1500మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో 500మంది వైద్యులు, 500మంది నర్సింగ్, 500మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు.
జీతాల కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. వారిని కలిస్తే వీరిని కలవండి, వీరిని కలిస్తే వారిని కలవండంటూ అధికారులు కాలం వెల్లదీస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘మా వేతనాల విషయమై ఇప్పటికే సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కలిస్తే, వారు కమిషనర్‌ను కలవాలని చెప్పారు.
కమిషనర్ కార్యాలయంలో సంప్రదిస్తే వారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వెళ్లి కలవండని చేతులు దులుపుకున్నారు. తీరా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వెళ్లి కలిస్తే ఫండ్స్ లేవు’ అని చేతులెత్తేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే తమ జీవితాల గోడుపై అటు అధికారులుగాని ఇటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగాని పట్టించుకోవడం లేదని ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నారు.