Ganesh Immersion | హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 5 : నగరంలో నవరాత్రులు పూజలందుకున్న వినాయకులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (శనివారం) జరిగే గణనాథుల శోభాయాత్రను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నారాయణగూడ పోలీసులు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గణేష్ శోభయాత్ర వెళ్లే ఈ మార్గం కీలక ప్రాంతం కావడంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని లిబర్టీ, బషీర్‌బాగ్, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల ప్రధాన రోడ్లపై భద్రతను కట్టు దిట్టం చేశారు. ఈ పీఎస్ పరిధిలోని సిబ్బందితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అదనపు సిబ్బందితో కలిసి 140 మంది పోలీసుల నిఘా అడుగడుగున ఏర్పాటు చేసి, పికెట్లు, 12పుషింగ్ పార్టీలు, సమస్యాత్మక మైన ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నిమజ్జనోత్సవ ఘట్టాలను పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తారు. బషీర్‌బాగ్, నారాయణగూడ ఫ్లై ఓవర్లను బారీకేడ్లతో మూసివేయనున్నట్లు ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు. ద్విచక్ర, ఇతర వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకే అనుమతి ఉంటుందని, గణేష్‌లు ఉన్న వాహనాలను మాత్రమే ట్యాంక్‌బండ్‌పైకి అనుమతిస్తామని తెలిపారు. భక్తులు పోలీసులకు సహాకారం అందించాలని సూచించారు.