బన్సీలాల్ పేట్, మార్చి 27 : మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బన్సీలాల్పేట్లోని బండమైసమ్మ నగర్, డి క్లాస్ సేవా సమితి అధ్యక్షుడు బి. మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కొన్ని రోజులుగా తరచూ డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు తాగునీటి పైప్లైన్లలో కలవడం వల్ల బస్తీ వాసులు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై జలమండలి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు.
జలమండలి సిబ్బంది వచ్చి తాత్కాలిక చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో మోరీలు నిండిపోయి డ్రైనేజీ నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయన్నారు. తాగునీరు పట్టుకోవాలంటే మహిళలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం బస్తీ కమిటీ నాయకులు రంగారావు, జగదీష్ సమస్య ఉన్న ఇళ్లల్లోకి వెళ్లి పరిశీలించారు. జలమండలి అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.