సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు చుట్టూ నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్ టన్నెల్ చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రణాళిక కార్యరూపంలోకి రావడం అసాధ్యమేనని ఓ అంచనాకు వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూ సేకరణకు రూ. 3వేల కోట్లు అవసరమవుతాయని సదరు ఏజెన్సీ ఇటీవల బల్దియాకు నివేదికను సమర్పించింది. సొరంగ పనుల కంటే బంజారాహిల్స్ రోడ్ నం .2 నుంచి , టన్నెల్‌కు ఇరువైపులా భూ సేకరణ కష్టమేనని సదరు ఏజెన్సీ పేర్కొందని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి బట్టి చూస్తే..భారీ ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టును చేపట్టడం అంత సులువు కాదని నిర్ధారించిన అధికారులు.. ఈ విషయాన్ని ప్రభుత్వ పరిశీలనలో పెట్టారు.
కేబీఆర్ పార్కు కింద సొరంగ మార్గంపై అధ్యయనానికి ఫిజిబులిటీ స్టడీ, డీపీఆర్ రూపకల్పనకు బల్దియా ఆర్వీ అసోసియేట్స్ ఏజెన్సీని ఖరారు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలోని రెండు టన్నెన్లను కమిటీ పరిశీలించింది. ప్రగతి మైదాన్ వద్ద 1.30 కిలోమీటర్ల మేర సొరంగమార్గం, ఆనంద్ విహార్ వద్ద సొరంగా మార్గం నిర్మాణం పనులపై అధ్యయనం చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 నుంచి కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం వరకు 1.70 కి.మీ, కేబీఆర్ ప్రధాన ద్వారం నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు 2 కిలోమీటర్లు, బంజారాహిల్స్ రోడ్ నం. 12 టన్నెల్ జాయినింగ్ పాయింట్ 1.10 కి.మీ, అప్రోచ్ రోడ్లు 1.50 కిలోమీటర్లు కలిపి మొత్తం 6.30 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. పార్కుపై ప్రభావం పడకుండా 100 అడుగుల లోతున సొరంగ మార్గం ఏర్పాటు కంటే.. భూ సేకరణ సులువు కాదని ఏజెన్సీ ఇచ్చిన నివేదికలో తేలింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.