Crime News | బంజారాహిల్స్, జనవరి 16: : ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తికి మద్యం తాగించి అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ పాతనేరస్తుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో అసిస్టెంట్‌గా పని చేస్తున్న వీర వెంకటరమణ ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయన బిగ్‌బాస్ గేమ్ షోతోపాటు ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు సెట్టింగ్ పనులు చేశాడు. కాగా, సంక్రాంతికి భార్య, కుటుంబసభ్యులతో కలిసి వెంకటరమణ రాజమండ్రి సమీపంలోని సొంతూరికి వెళ్లాడు. అయితే ఈనెల 13న అర్థరాత్రి అతడి ఇంట్లో భారీ చోరీ జరిగింది.
20 తులాల బంగారం, రూ.25లక్షల నగదుతో పాటు ఇతర వస్తువులు చోరీ అయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్ నేతృత్వంలో క్రైం సిబ్బంది స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఈనెల 13న రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఇంట్లోకి వెళ్లినట్లు తేలింది. సుమారు రెండు గంటల తర్వాత బైక్‌పై ఓ వ్యక్తి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. బైక్ మీద వచ్చిన వారిలో ఓ వ్యక్తిని వెంకటరమణ ఇంట్లో అద్దెకు ఉంటున్న తిరుమల్రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీ వ్యవహారం బయటపడింది. చోరీ చేసిన వ్యక్తి రహ్మత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో నివాసం ఉంటూ చెఫ్‌గా పనిచేస్తున్న దాసరి రక్షక్‌రాజ్(27) అనే పాతనేరస్తుడు అని తేలింది. స్వలింగ సంపర్కుడిగా ఉన్న రక్షక్‌రాజ్ ఫేస్బుక్ ద్వారా వెన్నపూస తిరుమల్‌రెడ్డి(49)ని ఇటీవల పరిచయం చేసుకున్నాడు.
సినిమా షూటింగ్స్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న తిరుమల్‌రెడ్డితో వాట్సాప్ చాటింగ్‌లో రక్షక్‌రాజ్ ఈనెల 13న సాయి వైన్స్ వద్ద కలుద్దామంటూ చెప్పాడు. ఇద్దరూ అక్కడ మద్యం సేవించి అనంతరం తిరుమల్‌రెడ్డి ఇంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరూ పీకలదాకా మద్యం తాగారు. అనంతరం తిరుమల్‌రెడ్డి నిద్రలోకి జారుకోగా.. రక్షక్‌రాజ్ ఫస్ట్‌ఫ్లోర్‌లోని వెంకటరమణ ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.25లక్షల నగదు చోరీ చేసి ఉడాయించాడు. ఈ మేరకు ప్రధాన నిందితుడు దాసరి రక్షక్రాజ్ను, అతడికి సహకరించిన తిరుమల్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు చోరీ సొత్తును రికవరీ చేశారు.