బంజారాహిల్స్, ఫిబ్రవరి 22: యూరోప్ టూర్ తీసుకెళ్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.., కాప్రాలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విష్ణువర్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమెకల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటారు. 2019లో బంజారాహిల్స్ రోడ్ నం.10లోని స్టార్ ఆస్పత్రి పక్కనున్న మంత్రా హాలిడేస్ సంస్థకు వచ్చిన విష్ణువర్దన్ రెడ్డికి సంస్థ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి పరిచయమయ్యాడు.
తమ సంస్థ నుంచి అనేక మందిని తక్కువ వ్యయంతో వరల్డ్ టూర్ తీసుకువెళ్లామని నమ్మబలికాడు. దీంతో తనతో పాటు తన కోలీగ్ వెంకట నారాయణతో కలిసి యూరోప్ టూర్ కోసం రూ.60 వేల చొప్పున చెల్లించాడు. కాగా, కొవిడ్ కారణంగా మూడేళ్ల పాటు టూర్ తీసుకువెళ్లడం కుదరలేదు. కాగా, 2023లో శివప్రసాద్ రెడ్డి గతంలో చెప్పిన టూర్‌కు బదులుగా మాల్దీవులు, దుబాయి దేశాలకు తీసుకువెళ్లానంటూ చెప్పారు.
అయితే, ఏడాదిన్నర గడిచినా టూర్ మాట ఎత్తకపోవడంతో పాటు ఫోన్లు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి ఇటీవల పరిశీలించగా, ఆఫీస్ ఖాళీ చేసినట్లు తేలింది. తమను మోసం చేసిన శివప్రసాద్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ విష్ణువర్దన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పో లీసులు ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.