బండ్లగూడ, ఫిబ్రవరి 11: తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ కాలనీలలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జల మండలి కార్యాలయం వద్ద పలు కాలనీల వాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయా కాలనీల అధ్యక్షులు మాట్లాడుతూ, వారానికి ఒక రోజు కూడ తమ కాలనీలో మంచినీళ్లు రావడం లేదని అధికారులకు వివరించారు. రోజు విడిచి రోజు మంచినీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు మేనేజర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. దీంతో శ్రీనివాస్ వారికి ఈ నెల 20వ తేదీలోపు మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఇచ్చిన సమయంలోపు సమస్య పరిష్కారం కాకపోతే, ఈ నెల 22వ తేదీన తిరిగి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.