Hyderabad Rain | బండ్లగూడ, జులై 18: హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని మెడిసిటీ, ఇందిరమ్మ కాలనీ, కిస్మత్పూర్, బండ్లగూడ, పీరంచెరువు, గంధం గూడా, బైరాగి గుడా తదితర ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారుల్లో వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, పాదచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పత్తాలేని మాన్సూన్ బృందాలు
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతి మున్సిపాలిటీలలో మాన్సూన్ బృందాన్ని అధికారులు సిద్ధం చేసుకుంటారు. ఎక్కడైనా వర్షం పడుతుందంటే రోడ్లపై నీరు నిలవకుండా మాన్సూన్ బృందాలు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతుంటారు. కానీ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసినప్పటికీ మాన్సూన్ బృందాలు పత్తా లేకుండా పోయాయి. వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పనిచేయాల్సిన మాన్సూన్ బృందాన్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల అనేక విమర్శలకు తావిస్తుంది. ఎప్పుడైనా వర్షాకాలం ఆరంభంలోనే మాన్సూన్ బృందాన్ని ఏర్పాటు చేసి, వాహనాలతో పాటు పలు రకాల పనిముట్లను అప్పగిస్తారు. కానీ కార్పొరేషన్ పరిధిలో అలాంటి బృందాలు కనిపించకపోవడం బాధాకరమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.