చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 9: విద్యుదాఘాతంతో పాత బస్తీకి చెందిన బండ్లగూడ భార్యాభర్తలు మృతి చెందారు. భార్య నల్లా మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీనిని గమనించిన భర్త భార్యను కాపాడబోయాడు. ఆయనకు కూడా కరెంట్ షాక్ తలగడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో బస్తీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్తీవాసులు, ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపిన ప్రకారం, గౌస్నగర్లో నివసించే షకీరాబేగం(30), తన్వీర్ మజ్జా (36), ఇద్దరు భార్యాభర్తలు, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
శనివారం ఉదయం మంచినీరు సరఫరా అవుతుండటంతో ఎప్పటిలాగానే మంచినీటిని పట్టుకునేందుకు షకీరాబేగం నల్లా మోటర్ స్విచ్ ఆన్ చేసింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే పెద్ద శబ్దం చేస్తూ కూప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన భర్త తన్వీర్ మజ్జా పరుగున వెళ్లి భార్యను రక్షించేందుకు ప్రయత్నించాడు. కాని, దురదృష్టవశాత్తు ఆయనకు కూడా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కూప్పకూలాడు. ఇంట్లో పిల్లలు, చుట్టు పక్కల వారు గమనించేటప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు.