బంజారాహిల్స్ : కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకారం అందించకపోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దేశంపై ప్రజలందరికీ హక్కుందని, దేశం మీ తాత జాగీరా అని ప్రశ్నించారు.
పిచ్చిపిచ్చి మాటలు మానుకోకపోతే బండి సంజయ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ అభివృద్దికి అడ్డుపడేవిధంగా బీజేపీ నాయకుల వ్యవహారశైలి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు.