కుత్బుల్లాపూర్/జగద్గిరిగుట్ట, మే 27: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను కోర్టు అనుమతితో బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడా హైడ్రామా మధ్యే కొనసాగింది. జైలు నుంచి నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలిస్తున్నట్లు మీడియాకు లీకులివ్వడంతో మీడియా మొత్తం పీఎస్ వద్దకు చేరుకుంది.
కానీ జైలు నుంచి కస్టడీలోకి తీసున్న నిందితుడిని నేరుగా మేడ్చల్ సీహెచ్‌సీకి తరలించి, వైద్యరీక్షలు చేయించిన పోలీసులు ముందుగా ప్రకటించినట్లు పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించకుండా గోప్యతతో మొయినాబాద్‌లోని అనన్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. ఆ సమయంలో భగీరథ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాలు రింగ్‌రోడ్డుపై వెళ్తుండగా విషయం తెలుసుకున్న మీడియా పోలీసు వాహనాలను అనుసరించగా, టోల్గేట్ వద్ద మీడియా వాహనాలను ఆపి, మీడియా దృష్టి మరల్చారు.
అనంతరం మొయినాబాద్ ఫాంహౌస్‌కు తరలించిన పోలీసులు నిందితుడితో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిపి, పలు కీలక వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం షాపూర్‌నగర్‌లోని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు విచారించిన తర్వాత చివరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రత్యేక విచారణ అధికారి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తొలిరోజు విచారణ పూర్తయింది.