బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలంటూ.. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదరిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. పోక్సో కేసు నమోదై పరారీలో ఉన్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని ఆపేదిలేదంటూ తేల్చి చెప్పారు.
అవసరమైతే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, మహా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగిన మహిళానేతలపై పోలీసులు జులూం ప్రదర్శించారు. తరలివస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడా నిర్బంధించారు. విగ్రహ ప్రాంగణానికి చేరుకోకుండా గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. బైఠాయించిన వారిని ఈడ్చిపడేశారు.. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
-సిటీబ్యూరో