అమీర్‌పేట్, సెప్టెంబర్ 28 : రాజ్యాధికార సాధనకై బీసీలు నడుం బిగించాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. ఆర్ధిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ, పదోన్నతులు వంటి విషయాల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి బీసీ మేధావుల ఫోరమ్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు సమగ్ర అధ్యయనాలు, గణాంకాలు, వివరాలతో కూడిన ‘హిస్సా, ఇజ్జత్, హుకుమత్,’ పేరుతో రచించిన పుస్తకంలో సవివరంగా వివరించారని, ప్రతి బీసీ ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా రాజ్యాధికార సాధన ఉద్యమానికి మానసికంగా మరింతగా దగ్గరయ్యే అవకాశం ఉందన్నారు.
ఆదివారం బేగంపేట్‌లోని ఐఎఎస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరమ్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు రచించిన ఈ పుస్తకాన్ని బీఎస్పి జాతీయ సమన్వయకర్త, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జె.పూర్ణచందర్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూధనాచారి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ ఎం.పిలు వి.హనుమంతరావు, బూర నర్పయ్యగౌడ్లతో పాటు మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత టి.చిరంజీవులు మాట్లాడుతూ బీసీల ఉద్యమానికి ఒక సైద్ధాంతిక పునాది నిర్మించి, తాము కోల్పోయిన ప్రయోజనాలను తిరిగి సాధించుకునేందుకు బీసీలంతా ఎందుకు ఏకం కావాల్సిన అవసరం ఉందనే విషయమై స్పష్టత ఇచ్చే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు.