హైదరాబాద్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం (Ban on Drones) విధించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. 10 కిలోమీటర్ల పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల వినియోగంపై ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ నిబంధలు శనివారం నుంచి జూన్ 9 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.