అమీర్పేట, జూలై 1: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలిరావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బారికేడ్లు, క్యూలైన్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతో అమ్మవారి దర్శనానికి ఆలస్యమైనా భక్తులకు క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తలేదు. కల్యాణానికి విచ్చేసిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి సంప్రదాయ పట్టు వస్ర్తాలను సమర్పించారు.
కల్యాణోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్సింగ్మాన్, పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. కల్యాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, సీహెచ్ మల్లారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఆలయ పరిసరాల్లో దాదాపు 100కు పైగా అన్నదాన శిబిరాలు వెలిశాయి. కాగా బుధవారం సాయంత్రం ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవంతో వేడుకలు ముగుస్తాయి.