అమీర్పేట్, జూన్ 14: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 3 రోజుల పాటు కొనసాగే అమ్మవారి కల్యాణోత్సవానికి దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు.
అంత ప్రతిష్టాత్మకంగా కొనసాగే ఎల్లమ్మ కల్యాణానికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని గత తెలంగాణ ప్రభుత్వం హయాంలో దశాబ్ద కాలం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సనత్నగర్ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్యాణోత్సవ ఏర్పాట్లకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లకు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించడం చూశాం. ఇక దేవాలయానికి సంబంధించిన అంతర్గత ఏర్పాట్లను అప్పటి ఈవోలు పర్యవేక్షించే వారు.
గత దశాబ్ద కాలంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి పూర్తిస్థాయి ఈవోలుగా కొనసాగిన సహాయ కమిషనర్లు వినోదొడ్డి, ఎంవీ శర్మ, ఎం అన్నపూర్ణ వేడుకలను విజయవంతం చేయడంలో తమ శక్తియుక్తులను ఏకం చేశారనే పేరుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత చోటు చేసుకున్న పరిస్థితుల్లో వేడుకల నిర్వహణకు పూర్తిస్థాయి ఈవో నియామకం జరగలేదు. గత ఏడాదికాలంగా దేవాలయ కార్యకలాపాలు ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతున్నాయి. తాత్కాలిక ఈవో కృష్ణ కల్యాణోత్సవానికి సరిగ్గా 15 రోజుల ముందు ఊహించని విధంగా శనివారం సెలవుపై వెళ్లారు. తాజాగా ఎల్లమ్మ దేవాలయానికి బదిలీపై వచ్చిన మహేందరక్గౌడ్ గ్రేడ్-1 ఈవోగా ఉన్నారు. 15 రోజుల్లో ప్రారంభం కానున్న ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఎలా ముందుండి నడిపిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2024లో దేవాలయ ఈవోగా కుంట నాగరాజు అనారోగ్య కారణాలతో కల్యాణోత్సవానికి కొద్ది రోజుల ముందే సెలవుపై వెళ్లారు. దీంతో అప్పటి నుంచి తాత్కాలిక ఈవోలే కొనసాగుతున్నారు. కల్యాణోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి సికింద్రాబాద్ సహాయ కమిషనర్గా ఉన్న బీ క్రిష్ణను అప్పట్లో ప్రభుత్వం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఈవోగా తాత్కాలిక బాధ్యతలపై పంపింది. అయితే ఇక్కడి విదాదాల ఒత్తిడికి తట్టుకోలేని బీ క్రిష్ణ కూడా వెంటనే సెలవుపై వెళ్లడంతో మరో సహాయక కమిషనర్ అంజనీదేవి ఈవోగా బదిలీపై వచ్చి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత కొద్ది రోజులకే అంజనీదేవి బదిలీ కావడంతో అంతకుముందు నియమితులైన బీ క్రిష్ణ తిరిగి విధుల్లో చేరారు. ఆ విధంగా పూర్తి స్థాయిలో కాకుండా కేవలం ఇనిచార్జి ఈవోలతోనే కల్యాణోత్సవాలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈ మధ్య కాలంలో తరుచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో టికెకట్ వెండింగ్ మెషీన్లో చోటు చేసుకున్న నకిలీ టిక్కెట్ల అంశం వెలుగు చూసిన విషయం విదితమే. ఈ సంఘటనపై ఓ చిరుద్యోగిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న ఆలయ అధికారులు.. వాస్తవాలు వెలికి తీసేందుకు పూర్తిస్థాయి విచారణ జరపలేదు. ఈ విషయంలో దేవాలయంలోని కొందరు ఉద్యోగుల హస్తం కూడా ఉండి ఉంటుందనే ఆరోపణలు గతంలో వినిపించాయి.
కోవిడ్ తర్వాత దేవాలయానికి భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరగడం, ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరగడంతో ఇక్కడ ఈవోగా బాధ్యతల నిర్వహణ కత్తి మీద సాములాగే ఉంటుందని గతంలో ఇక్కడ పని చేసిన అధికారులు చెబుతుంటారు. తాజాగా ఈవో క్రిష్ణ కూడా ఒత్తిడిని తట్టుకోలేక సెలవైపై వెళ్లారనే ప్రచారం ఉంది. అయితే కల్యాణోత్సవ సమయంలో దేవాలయ ఉద్యోగుల మధ్య అంతర్గత అంశాలు, వివిధ పక్షాల నుంచి ఎదురయ్యే స్థానిక రాజకీయాలను కొత్త ఈవో ఏ విధంగా నెటుకొసారో వేచి చూడాలి.